రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో వైసీపీ తురుపుముక్క!

  • Published By: chvmurthy ,Published On : February 22, 2020 / 06:21 AM IST
రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో  వైసీపీ తురుపుముక్క!

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.  ఈ నాలుగు  స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి.  సీఎం  జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక  చేసే పనిలో పడ్డారు. అయితే ఈ నాలుగు స్ధానాలకు జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై  పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఉత్కంఠ ఏర్పడింది. 

ఇప్పటికే మండలి రద్దు కావడంతో మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు  రాజ్యసభ సీట్లు దాదాపు ఖరారైపోయాయని ప్రచారం జరుగుతుండగా తాజాగా మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. వైసీపీ తో సన్నిహితంగా ఉంటున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా రాజ్యసభ స్ధానాల్లో తమ వారికి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ కి రాజ్యసభలో బలం లేదు. గతంలో సురేష్ ప్రభు, నిర్మలాసీతారామన్ వంటి వారు ఏపీనుంచి టీడీపీ హయాంలో రాజ్యసభకు వెళ్ళినవారే. ఇప్పడు కూడా ఆవిధంగానే రెండు సీట్లలో అవకాశం కల్పించాలని కమల నాధులు జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. 

వైసీపీ లో మోపిదేవి, పిల్లి బోసు ల పేర్లు కాక…. మరి కొందరు ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చాయి. వాటిలో మెగా స్టార్ చిరంజీవి,  వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన రాంకీ గ్రూప్స్ అధినేత అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన బీదా మస్తాన్ రావు ,సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

అయితే వీరందరి పేర్లతో పాటు జగన్ చెల్లెలు షర్మిల పేరు కూడా వినబడుతోంది. అయితే షర్మిలను రాజ్యసభకు పంపిస్తే జాతీయ స్థాయిలో వైసీపీ ఇమేజ్ మరింత పెరుగుతుందని వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని జగన్ దగ్గర చర్చించినట్టు సమాచారం. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు  తెలుస్తోంది.
ys Jagan Ys sharmila

ఎందుకంటే కష్టకాలంలో  పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని పాదయాత్ర చేసి పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపారు.  కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు. దీంతో షర్మిలను రాజ్యసభకు పంపి తన చెల్లెలుకు తగిన గుర్తింపు నివ్వాలనే యోచనలో జగన్ ఉన్నారు. మరో వైపు షర్మిల ద్వారా  జాతీయ రాజకీయాల్లో  కీలకపాత్ర పోషించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

Read More>>నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు..పరిస్థితి విషమం: శివరాత్రి వేడుకల్లో అపశృతి

ఎందుకంటే  దేశంలోని పలు ప్రధాన పార్టీలనుంచి మహిళా నాయకురాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ,  నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ కుమార్తె సుప్రియా సూలే, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి డీఎంకే నుంచి, వంటి వారు జాతీయ రాజకీయాల్లో ఆయా పార్టీల తరుఫున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు షర్మిల ద్వారా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే యోచనలో జగన్ ఉన్నారు.

మరోవైపు పార్టీకి చెందిన కీలక నేత విజయసాయి రెడ్డి  ఢిల్లీ లెవల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతుంటే……షర్మిల ద్వారా పార్టీని జాతీయ రాజకీయాల్లో ఫోకస్ చేసే యోచనలో జగన్ ఉన్నారు. ఇప్పుడు జాతీయరాజకీయాల్లోనూ షర్మిల జగన్న బాణం కాబోతున్నారు.  

ఒక వైపు మహిళలకు న్యాయం చేసినట్లు అవుతుంది.  లోక్ సభలో అత్యధిక సభ్యులు కల 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ కూడా మహిళలకు పార్టీలో పెద్ద బాధ్యతలను అప్పచెప్పటం, కష్ట కాలంలోపార్టీని కాపాడిన  చెల్లెమ్మకు కృతజ్ఞతగా సముచిత స్ధానం ఇచ్చి గౌరవించటం వంటి ఎన్నో అంశాలతో షర్మిలను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది.  మొత్తంగా ఇన్ని పేర్లు వైసీపీ తరుఫున  సోషల్ మీడియాలో  వినిపిస్తున్నా….. ఫైనల్‌గా  వైసీపీ తరుఫున పెద్దల సభలో అడుగుపెట్టేది ఎవరో తెలియాలంటే మాత్రం కాస్త  వేచి చూడాల్సిందే.