Indrasena Reddy Nallu : ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవనున్నాయి- బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది సరిపోక దేశవ్యాప్తంగా మోసానికి బయల్దేరారు. Indrasena Reddy Nallu - BJP

Indrasena Reddy Nallu (Photo : Google)
Indrasena Reddy Nallu – BJP : తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది. పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ఇంద్రసేనా రెడ్డి నిప్పులు చెరిగారు.
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవనున్నాయని ఆయన చెప్పారు. కేసీఆర్ కంటే పెద్ద దగాకోరు పార్టీ కాంగ్రెస్ అన్నారు. గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టలేదని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలన్నారు.
”ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది? మీకు బీఆర్ఎస్ తో బిజినెస్ సంబంధాలు లేవా? కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని వాళ్ళతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలవనున్నాయి. కలుస్తారని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ.
బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల నుంచి అప్లికేషన్ తేదీ పొడిగింపుపై ఎటువంటి చర్చ జరగలేదు. కిసాన్ సర్కార్ అంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది సరిపోక దేశవ్యాప్తంగా మోసానికి బయల్దేరారు. కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీ అందకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టి రైతులు సొమ్మసిల్లారు. అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న వ్యక్తి ప్రధాని మోదీ. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని బస్తా మీద ముద్రిస్తున్నారు. ఈ విషయం రైతులకు తెలియకూడదని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది.
Also Read..Narayana : ఇండియా కనపడితే మోదీ భయపడి భారత్ గా మారుస్తున్నారు : నారాయణ
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గతంలో ఎరువుల కొరత ఉండేది. కానీ, నేడు అలాంటి పరిస్థితి లేదు. మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను రీ ఓపెన్ చేశారు మోదీ. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని మర్చిపోయారు. చేతగానితనంతోనే కేంద్రం ఇచ్చే ఎరువులను కేసీఆర్ రైతులకు ఇవ్వలేకపొతున్నారు.
కేసీఆర్ కి రాజకీయం తప్ప ఇంకేమీ చేతకాదు. మార్క్ ఫెడ్ లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలి. లేదంటే రైతులకు నేరుగా మేమే వాటిని పంచుతాం. రాజకీయం ఉంటే పార్టీల తరపున కొట్లాడదాం. రైతులతో చెలగాటం వద్దు” అని నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు.