మిమ్మల్ని నమ్మాను : కులాలు, మతాలు, పార్టీలు, లంచాలకు అతీతంగా పని చేయండి

  • Published By: chvmurthy ,Published On : September 30, 2019 / 07:24 AM IST
మిమ్మల్ని నమ్మాను : కులాలు, మతాలు, పార్టీలు, లంచాలకు అతీతంగా పని చేయండి

కుల మాతాలు, రాజకీయాలకతీతంగా, పార్టీల కతీతంగా, లంచాలు తీసుకోకుండా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందేలా గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని సీఎం జగన్ కోరారు.  రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల్లో  ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఆయన సెప్టెంబర్ 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందచేశారు. వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటి వారని, మిమ్మల్ని నమ్మాను.. వివక్ష లేకుండా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వచ్చే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నానని ఆయన అన్నారు. 

సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్ తో అనుసంధానం చేసుకుని ప్రతి పేదవాడి సమస్యను 72 గంటల్లో పరిష్కరించేలా కృషి చేయాలని సీఎం అన్నారు, సొంత మండలంలో పని చేసే అవకాశం అందరికీ రాదని, అలాంటి అవకాశం మీకు వచ్చిందని మీరంతా మీ గ్రామ ప్రజల రుణం తీర్చుకోమని హితవు పలికారు.  తన సుదీర్ఘ  పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనికి లంచం తీసుకునే దౌర్భాగ్య పరిస్ధితి గమనించానని, ఆ వ్యవస్ధను నిర్మూలించి  పేదవాడి  ముఖంలో ఆనందం చూడటానికే గ్రామ సచివాలయ వ్యవస్ధను తీసకు వచ్చినట్లు ఆయన చెప్పారు.  

అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే గ్రామానికి  12 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, తద్వారా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన అన్నారు. అవినీతి లేని పాలన కోసం  గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని.. మీరంతా ఉద్యోగాన్ని ఉద్యమంలా తీసుకుని పనిచేయాలని కోరారు.  ప్రభుత్వానికి చెందిన 34 డిపార్ట్ మెంట్ల 500సేవలు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందనున్నట్లు సీఎం జగన్  వివరించారు. జనవరి 1. 2020 నాటికి పూర్తి స్ధాయి సౌకర్యాలతో గ్రామ సచివాలయాలు  పనిచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోందని ఆయన తెలిపారు. మీ పనితీరు బాగా ఉఁటే రాష్ట్రం బాగుంటుంది. మీ పై నాకు సంపూర్ణ  నమ్మకంఉంది కనుక మీపై ఈ బాధ్యతలు మోపానని మీ అందరి అన్నగా మీకు ఈ బాధ్యతలు అప్పచెపుతున్నానని అన్నారు. ఇప్పడు ఉద్యోగాలు రానివారెవ్వరూ  నిరాశ చెందవద్దని, ప్రతి ఏటా జనవరిలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ చేపడతామని హర్ష ధ్వానాల మధ్య జగన్ చెప్పారు.