ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… రాజధాని భూములు వాపస్

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 02:12 AM IST
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… రాజధాని భూములు వాపస్

ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతున్న వేళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు  సీఎం జగన్ ఎలాంటి అన్యాయం చేయరు.. మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తాం.’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు.  

అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ….. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న అమరావతి రైతులతో ఇప్పటికిప్పుడు మాట్లాడాల్సిన పనిలేదని…..  ఈ పరిస్ధితుల్లోవారితో మాట్లాడినా వారు మాట వినరని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చు. ఇతర ప్రాంతాల్లోని వారికి అభివృద్ధి అక్కరలేదా?. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రం అంతటా సమ అభివృద్ధి జరుగుతుంది.

రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారు. రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరు. మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తాం. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయలనంటే సాధ్యం కాదు. తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తాం. పూలింగ్ అని కొత్త విధానంలో భూమి తీసుకున్నారు. మళ్ళీ అదే విధానం లో వెనక్కు కూడా ఇవ్వొచ్చు. ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు.’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  

మూడు రాజధానుల ద్వారా రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుందన్న మంత్రి.. సీఎం జగన్ రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. రైతులకు జగన్ సర్కారు అన్యాయం చేయదని ఆయన భరోసా ఇచ్చారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతుల పక్షాన మాట్లాడుతున్నానని చెప్పడం విచిత్రంగా ఉందని పెద్దిరెడ్డి విమర్శించారు. రాయలసీమకు కావాల్సింది రాజధాని, సచివాలయం కాదని.. ఆ ప్రాంత ప్రజానీకానికి తాగునీరు, సాగునీరు కావాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

విశాఖలో సెక్రటేరియట్ పెడితే రాయలసీమ వాసులకు ఇబ్బంది అవుతుందన్న వాదనతో మంత్రి విబేధించారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమ ప్రాంతానికి ఇబ్బంది లేదని చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్ జనవరి 3న వస్తుందని ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెద్దిరెడ్డి చెప్పారు.