Putta Madhu : నన్ను చంపేందుకు కుట్ర..? పుట్ట మధుపై సంచలన ఆరోపణలు, టికెట్ ఆశిస్తే చంపేస్తారా?
ఆయనకు ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తారా? టికెట్ అడగటం తప్పా? టికెట్ ఆశించే హక్కు అందరికీ ఉంది. Putta Madhu - Challa Narayana Reddy

Putta Madhu - Challa Narayana Reddy
Putta Madhu – Challa Narayana Reddy : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పాలిటిక్స్ హీటెక్కాయి. కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు నారాయణ రెడ్డి. ఇటీవల కొండగట్టులో కొంతమందితో పుట్ట మధు సమావేశం నిర్వహించారని, గన్ మెన్లను తొలగించి తనను చంపడానికి కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. మంథని బీఆర్ఎస్ టికెట్ ఆశించడంతోనే పుట్ట మధు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు చల్లా నారాయణ రెడ్డి.
”మా నియోజకవర్గ ఇంఛార్జి పుట్ట మధు కొండగట్టు ప్రాంతంలో రిసార్ట్స్ లో 80మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నాకున్న గన్ మెన్లను తొలగించి నా అంతు చూస్తానని చెప్పి కుట్ర పన్నారు. నాకు చాలా ప్రమాదం పొంచి ఉంది. నా గన్ మెన్లను ఎలా తొలగిస్తారు? ఆయనకు ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తారా? టికెట్ అడగటం తప్పా?
Hyderabad : బీకేర్ ఫుల్.. భారీ లాభాల పేరుతో ఘరానా మోసం, కోట్లు స్వాహా చేసిన ఏలూరుకి చెందిన దంపతులు
ప్రతి పార్టీలో కాంగ్రెస్, బీజేపీలో టికెట్ కోసం అప్లయ్ చేసుకోమంటున్నారు. టికెట్ ఆశించే హక్కు అందరికీ ఉంది. ఆశించినంత మాత్రాన అడ్డు తొలగించుకుందామని ఈ రకంగా నా గన్ మెన్లను తొలగించి నన్ను చంపేందుకు కుట్రలు చేస్తున్నాడు. నాకు పుట్ట మధుతో ప్రాణహాని ఉంది” అని చల్లా నారాయణ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
మంథని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని అదే పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ఉద్యమకారులు అంతా వ్యతిరేకిస్తున్నారు. పుట్ట మధు ఎవరినీ కలుపుకుని వెళ్లడని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాటారం సింగిల్ విండో ఛైర్మన్ చల్లా నారాయణ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానికులు తరలి రావడం మంథనిలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంలోనే నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పుట్ట మధుతో తనకు ప్రాణహాని ఉందన్నారు. ఇటీవలే కొంతమంది కార్యకర్తలతో పుట్ట మధు రహస్య సమావేశం నిర్వహించారని, తన గన్ మెన్లను కూడా తొలగించాలని పుట్ట మధు వారితో చెప్పినట్లు నారాయణ రెడ్డి చెప్పారు. గన్ మెన్లను తొలగించడం ద్వారా తనను హత్య చేయొచ్చని భావిస్తున్నారని నారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు.
నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలతో మంథని రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. తనకు ప్రాణహాని ఉందని నారాయణ రెడ్డి చెప్పడం మంథనిలో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ టికెట్ ను చల్లా నారాయణ రెడ్డి ఆశించారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని చల్లా నారాయణ రెడ్డి చెప్పారు.
ఇప్పటికే పుట్ట మధుపై పలు ఆరోపణలు వచ్చాయి. మంథని బీఆర్ఎస్ నేతలు మధు తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుపుకుని పోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే పుట్ట మధుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. తాజాగా మరోసారి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, బీఆర్ఎస్ మంథని టికెట్ ను ఈసారి పుట్ట మధుకే కేటాయించడం జరిగింది. తనపై వస్తున్న ఆరోపణలపై పుట్ట మధు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.