అమరావతిలో పాగా వేస్తా: పవన్ కళ్యాణ్

గుంటూరు: అధికారంకోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, అవినీతి రాజకీయాలతో విసిగి పోయి, రాజకీయప్రక్షాళన జరగాలనే ఉద్దేశ్యంతోనే జనసేన పార్టీ స్ధాపించానని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం గుంటూరులో జనసేన శంఖారావం పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేద్దామని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం,విభజన అంశాలు సాధన కోసం కలిసి పోరాడదామని టీడీపీ, వైసీపీలను కోరారు.
జనసేనను అణచటానికి ఎంత ప్రయత్నిస్తే, అంతకుపై ఎత్తులు తానూ వేస్తానని ఆయన చెప్పారు. ‘‘గోదావరి జిల్లాలో తిరుగుతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. నేను పుట్టింది గుంటూరు జిల్లానే, పల్నాటి బిడ్డను, గుంటూరు జిల్లాను… ఎలా మర్చిపోతాను. అమరావతి లో జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రావాలి అనుకుంటే 2009 లోనే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయి ఉండే వాడిని అని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు జనసేన పార్టీ నిద్రపోదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాది నాయకులు సభలో కాళ్లు ఊపుకుంటూ కూర్చున్నారని, ఉత్తరాది అహంకారంతో ఏపీని విడగొట్టారని ఆయన అంటూ…. టీడీపీ, వైసీపీ మర్చిపోతాయేమో గాని జనసేన మర్చిపోదని ఆయన అన్నారు. ఉత్తరాది అహంకారం దించే వరకు జనసేన నిద్రపోదని తెలిపారు.