విజయవాడలో ఉద్రిక్తత.. బీజేపీ నేతలు అరెస్ట్, కొడాలి నాని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

  • Published By: naveen ,Published On : September 24, 2020 / 01:45 PM IST
విజయవాడలో ఉద్రిక్తత.. బీజేపీ నేతలు అరెస్ట్, కొడాలి నాని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… సబ్‌ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్దన్‌ రెడ్డి, పాతూరి నాగభూషణంతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కొడాలి నాని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని… అందుకే ప్రధాని మోదీ, యోగి ఆదిత్య నాథ్‌పై నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. కొడాలి నాని కేబినెట్‌ నుంచి తొలగించే వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామన్నారు.

తిరుమల డిక్లరేషన్, దేవతల విగ్రహాల విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని బీజేపీ నేతలు, ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి తమ భార్యలతో ఆలయాలకు వెళ్తున్నారా? అని కొడాలి నాని అడిగారు. సీఎం జగన్ సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. తిరుమలలో డిక్లరేషన్ అవసరం లేదని కొడాలి నాని చెప్పారు. దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది.



కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో సెగలు పుట్టిస్తోంది. కాగా, కొడాలి నాని మాత్రం తగ్గేది లేదంటున్నారు. తన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పేది లేదంటున్నారు. దేశంలో ఎక్కడా పాటించని డిక్లరేషన్ రూల్ ని తిరుమలలో మాత్రమే ఎందుకు పాటించాలని ప్రశ్నిస్తున్నారు. కులాలు, మతాలు, ఆలయాల పేరుతో టీడీపీ, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.