సచిన్‌, కోహ్లి, అక్షయ్, లతా మంగేష్కర్ ట్వీట్లపై ఇంటెలిజెన్స్ దర్యాఫ్తు.. మహా ప్రభుత్వం సంచలన నిర్ణయం

సచిన్‌, కోహ్లి, అక్షయ్, లతా మంగేష్కర్ ట్వీట్లపై ఇంటెలిజెన్స్ దర్యాఫ్తు.. మహా ప్రభుత్వం సంచలన నిర్ణయం

Maharashtra Intelligence To Probe Tweets Of Sachin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు రైతులకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కేంద్రానికి మద్దతిచ్చారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కేంద్రానికి మద్దతు తెలిపారు. రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్స్‌ పై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

సచిన్‌ టెండూల్కర్‌, గాయని లతా మంగేష్కర్‌తో పాటు బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై దర్యాప్తు జరుపుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించడం సంచలనం రేపుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్‌ సంస్థలు దర్యాప్తు జరుపుతామని అనిల్‌ ప్రకటించారు. వరుస ట్వీట్స్‌ వెనుక కేంద్ర ప్రభుత్వ లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు వివాదానికి దారితీశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్స్‌ చేశారు. వీరిలో పాప్‌ సింగర్‌ రిహానే, పర్యవరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌, మియా ఖలిఫా వంటి వారు ఉన్నారు. భారత్‌లో రైతులు జరుపుతున్న ఉద్యమానికి తాము సంఘీభావం తెలుపుతున్నామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి మద్దతును ఖండిస్తూ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, అక్షయ్‌కుమార్‌ తదితర సెలబ్రిటీలు ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంలో వారు కేంద్రానికి మద్దతుగా నిలిచారు.

భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతరులకు లేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ పరిణామం దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే సచిన్‌, లతా మంగేష్కర్‌ వంటి వారు ఈ ట్వీట్స్‌ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.