కూలిపోయే స్థితిలో టీడీపీ, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

కూలిపోయే స్థితిలో టీడీపీ, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

minister peddi reddy fires on chandrababu naidu: ఇప్పటివరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కుప్పంలోనే కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పారు.

‘మూడో విడతలో 2,574 సర్పంచి స్థానాలు వైసీపీకి దక్కాయి. టీడీపీ 509 స్థానాల్లో గెలుపొందింది. కుప్పంలో 89 సర్పంచి స్థానాల్లో వైసీపీ 75 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 14 స్థానాల్లోనే విజయం సాధించింది. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి. తన పదవి నుంచి తప్పుకుంటే బాగుంటుంది. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా వైసీపీకే విజయాలు లభించడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలన్నీ సీఎం జగన్ వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ బలపర్చిన వాళ్లే గెలిచారని, అందుకు కారణం కుప్పంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని స్పష్టం చేశారు.

మూడో విడత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,574 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే, టీడీపీ కేవలం 13 శాతం విజయాలకే పరిమితమైందని మంత్రి అన్నారు. కానీ చంద్రబాబు 36శాతం గెలిచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే నిలిచారని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

కుప్పంలో ఏకగ్రీవాల్లోనూ తమదే హవా అని, టీడీపీకి 15.8 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, తమకు 85.81 శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం, రెండోదశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచిందని మంత్రి తెలిపారు.