పాక్ చెరలో ఉన్న ఏపీ జాలర్లు త్వరలో విడుదల

  • Published By: chvmurthy ,Published On : January 4, 2020 / 08:38 AM IST
పాక్ చెరలో ఉన్న ఏపీ జాలర్లు త్వరలో విడుదల

పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని  భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చిందని రాష్ట్ర మత్య్య పరిశ్రమల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు జాలర్ల విడుదలకు మరోక నెల సమయం పడుతుందని ఆయన చెప్పారు. పాక్ చెరలోని జాలర్లను 6వ తేదీ సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద భారత  అధికారులకు అప్పచెప్పనున్నారు.

రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం కు చెందిన జాలర్లను గుజరాత్ తీరంలో పాకిస్తాన్  తీర ఫ్రాంత గస్తీ దళం వీరిని అరెస్టు చేసింది. వీరిని విడుదల చేయాలని  కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  2019, ఆగస్టు 22న  విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు లేఖ రాశారు. 

రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి విడుదల కోసం చిత్తశుధ్ధితో ప్రయత్నం చేయలేదని మోపిదేవి ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే వారి విడుదల కోసం ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారి కుటుంబాలకు నెలకు రూ.4,500 ఆర్ధికసాయం అందిస్తున్నామని మోపిదేవి చెప్పారు.  గూఢచర్యం ఆరోపణలతోపాకిస్తాన్ వీరిని గతంలో అరెస్టు చేసింది.