గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా : పవన్ నామినేషన్

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 09:19 AM IST
గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా : పవన్ నామినేషన్

విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం(మార్చి 21, 2019) విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది అని పవన్ అన్నారు. గాజువాక నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక సమస్యలపై ఏ పార్టీలు స్పందించడం లేదని పవన్ వాపోయారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణను నిలబెట్టామని, క్రిమినల్ పొలిటీషియన్లకు వ్యతిరేకంగా బరిలోకి దింపామని చెప్పారు.
Read Also : సత్తా ఏంటో చూపిస్తానంటున్న పవన్

గాజువాక, భీమిలి, విశాఖ సౌత్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొంటారు. ముందు పాత గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో, తర్వాత ఆనందపురం పూల మార్కెట్‌ దగ్గర.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పాత జైలు రోడ్డు దగ్గర నిర్వహించే సభలో పాల్గొంటారు. గాజువాక మాత్రమే కాదు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి కూడా పవన్ పోటీ చేయబోతున్నారు. భీమవరంలో శుక్రవారం(మార్చి 22.,2019) నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్  వేసిన తర్వాత ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

ఎన్నికల్లో పోటీకి సంబంధించి పవన్ తన అన్న చిరంజీవిని ఫాలో అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి.. తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేశారు. సొంత జిల్లాలోని పాలకొల్లులో ఓడిపోగా, తిరుపతిలో గెలుపొందారు. ఇప్పుడు పవన్… పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో దిగుతున్నారు. కాపు సామాజికవర్గం ఓటర్లు, అభిమానులు ఎక్కువగా ఉండటంతో  ఈ 2 చోట్ల పవన్ పోటీ చేస్తున్నారు. మరి పవన్ అంచనాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.
Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్