ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు

ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు

pawan kalyan will announce ap bjp cm candidate: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. ఫిబ్రవరి 14న ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరతామన్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రధానిని చేసిన ఘనత ఒక్క బీజేపీదేనని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయగలవా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అధికారం తనకు లేదన్న సోమువీర్రాజు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మిత్రపక్షమైన పవన్.. చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని సోమువీర్రాజు తెలిపారు. బీజేపీకి ఓటు బ్యాంకు లేదంటే మరి మంత్రులు ఎందుకు తమ పార్టీ గురించి మాట్లాడుతున్నారని సోమువీర్రాజు ప్రశ్నించారు.

ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థి గురించి:
బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీది. దేశంలో అనేకమంది బీసీలను ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది. ఏపీలో మీరు బీసీ వ్యక్తిని సీఎంని చేస్తారా? అని వైసీపీ, టీడీపీలను అడగటం జరిగింది. ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని నేనే ప్రకటిస్తాను అనే చర్చను తెరపైకి తెచ్చారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అఖిలభారత స్థాయిలో ముఖ్యమంత్రులను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారు.

వైసీపీ మంత్రుల కామెంట్స్ పై:
ఓటు బ్యాంకు లేనటువంటి పార్టీపై ఆరోపణలు చేస్తే వారి ఎనర్జీ తగ్గిపోతుంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీపై కామెంట్లు చేయాల్సిన అవసరం వారికి ఎందుకొచ్చింది? వైసీపీ నేతలు అవనసరంగా ఇబ్బందికరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మేము వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి:
ప్రజా ఉద్యమంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ అది. స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రిని, స్టీల్ మంత్రిని కలవడం జరిగింది. ఈ నెల 14న కేంద్రమంత్రులను, జేపీ నడ్డాని కలుస్తాం. స్టీల్ ప్లాంట్ విషయాన్ని ప్రస్తావిస్తాం. స్టీల్ ప్లాంట్ ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయమని వారిని కోరతాం.