స్వర్ణ ప్యాలెస్‌ చుట్టూ రాజకీయ మంట!

  • Published By: sreehari ,Published On : August 20, 2020 / 09:24 PM IST
స్వర్ణ ప్యాలెస్‌ చుట్టూ రాజకీయ మంట!

అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేశ్‌ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది.



పది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఇప్పుడు మాత్రం అధికార పక్షమైన వైసీపీ, బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఆస్పత్రి యాజమాన్యంపై కక్ష సాధింపు సరికాదని అంటున్నాయి.

టీడీపీ వల్లనే అంటూ ప్రచారం :
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వల్లనే ఆస్పత్రి యాజమాన్యం ఇబ్బందుల్లో పడుతోందనే ప్రచారం బయట జరుగుతోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గుంటూరులోని రమేశ్‌ హాస్పిటల్‌లో చికిత్స చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో కొవిడ్ వారియర్స్‌తో ఒక సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశంలో రమేశ్‌ హాస్పిటల్ అధినేత రమేశ్‌బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ రెండు ఘటనలే ప్రభుత్వం రమేశ్‌ హాస్పిటల్‌ని టార్గెట్ చేయడానికి కారణాలుగా చూపిస్తూ అటు టీడీపీలో, ఇటు బయట వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.



స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన జరిగి పది రోజులు దాటింది. మొదట్లో టీడీపీ ఈ విచారణ తీరుతెన్నులను పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఒక పెద్ద సంఘటన కాబట్టి చట్టప్రకారం అన్నీ జరుగుతాయని భావించారు. కానీ టీడీపీ వల్లే ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ఇప్పుడు పార్టీ తరఫున వారికి అండగా నిలబడకపోతే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొంత చర్చ జరిగిందట.

మొదట్లో చాలా మంది ఇది చాలా సీరియస్ ఘటన కాబట్టి దీంట్లో మన పాత్ర పరిమితమేనని, విచారణ జరిపించాలి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే వరకే పరిమితం కావాలని సూచించారు. తర్వాత ప్రభుత్వ ఆంతర్యాన్ని గ్రహించిన ప్రతిపక్ష టీడీపీ.. ఆస్పత్రి యాజమాన్యానికి అండగా నిలబడాలని నిర్ణయించిందట.



ఈ ఘటన జరిగిన మొదట్లో పార్టీలోని ఎవరూ పెద్దగా మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారట. ఈ ఘటనపై టీడీపీ సైలెంట్‌గా ఉన్నప్పటికీ అధికార పక్షం వైపు నుంచి కొంత రెచ్చగొట్టే వైఖరి కనిపించింది. మొదటగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… టీడీపీ, చంద్రబాబు ఈ ఘటనపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రమేశ్‌ హాస్పటల్ అధినేత రమేష్ చౌదరి కాబట్టి మీరు మాట్లాడరా అంటూ ఒకింత రెచ్చగొట్టేలా టీడీపీని టార్గెట్ చేశారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన విచారణ ఎటునుంచి ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది.

రామ్‌కి బాసటగా చంద్రబాబు :
ఈ కేసు విచారణ గురించి సినిమా హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు స్పందించే పరిస్థితి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యానికి బంధువైన సినీ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసు ఇస్తామన్నారు కూడా. దీనికి రామ్‌కి బాసటగా చంద్రబాబు నిలిచి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సైతం రామ్ చేసిన వ్యాఖ్యలకు సమర్థిస్తున్నాయి. పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్‌తో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు పోలీసులు చేస్తున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.



రమేశ్‌ హాస్పిటల్ గత ముప్పై సంవత్సరాలుగా విజయవాడలో ప్రజలకు సేవ చేస్తోందని, అలాంటిది ఆయనకు కులాన్ని అంటగట్టి అధికార పార్టీ టార్గెట్ చేయటం ఎంతవరకు సబబు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి బంధువులను, వారి ఇంట్లో మహిళలను పోలీసులు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు చూస్తున్నారని మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై పది రోజుల పాటు టీడీపీ పట్టించుకోకపోవటంపై చాలా విమర్శలు వచ్చాయి. కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారట. కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ అంశంలో ఆస్పత్రి యాజమాన్యానికి అండగా నిలబడాలని అడుగుతున్నారట. ఆ రెండు జిల్లాల నేతలు చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకువచ్చారు. అందువల్లనే పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.