లేడీ సూపర్‌స్టార్‌.. సినిమాలపైనే విజయశాంతి ఫోకస్‌!

  • Published By: sreehari ,Published On : January 7, 2020 / 12:02 PM IST
లేడీ సూపర్‌స్టార్‌.. సినిమాలపైనే విజయశాంతి ఫోకస్‌!

లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి రాజకీయాలకు దూరమయ్యేలా కనిపిస్తోంది. సినిమాల్లో స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో పని చేయడమే కాదు.. సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత నడపలేక టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్‌కు చెల్లెలుగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే, అప్పటి ప్రచారంలో కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత విజయశాంతి పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు.

సినిమాల్లోకి రీఎంట్రీ :
అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా విజయశాంతి కొనసాగారు. కానీ, ఆమె ఆ ప్రచారంలో కనిపించలేదు. అప్పటి నుంచి ఇక విజయశాంతి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో ఆమె రాజకీయాలకు దూరం కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. అంతే అప్పటి నుంచి ఇక విజయశాంతి సినిమాలకే పరిమితం అయిపోతారనే ప్రచారం జోరుగా సాగింది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారనేది ఎవరికీ అంతు చిక్కదు. ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేసే విజయశాంతి… ఎన్నికల తంతు ముగిశాక అసలు కనిపించరు. దీంతో ఆమెకు రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేదనే వార్తలు గుప్పుమనడం సాధారణమైపోయింది.

కేసీఆర్‌‌కు చెల్లెలుగా :
టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్‌కు విజయశాంతికి తగిన గుర్తింపు ఇచ్చారు. తన చెల్లెలు విజయశాంతి అని పలు సందర్భాల్లో ప్రకటించారు. అలానే ఎంపీగా అవకాశం కూడా ఇచ్చి, గెలిపించుకున్నారు. తెలంగాణ రాక ముందు ఆ పార్టీకి కేసీఆర్‌, విజయశాంతి మాత్రమే ఎంపీగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలొచ్చాయి. తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి ఘోరంగా దెబ్బతిన్న విజయశాంతి.. కొంత కాలం క్రితం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిశాక బయట పెద్దగా కనిపించ లేదు. అప్పుడప్పుడు ట్విటర్‌లో కేసీఆర్‌ సర్కారుపై దుమ్మెత్తి పోశారు.

రాజకీయాలకు దూరమైనట్టేనా? :
కాంగ్రెస్‌ తరఫున కూడా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించడం లేదు విజయశాంతి. ఈ సమయంలోనే 15 ఏళ్ల తర్వాత మేకప్‌ వేసుకుని ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో ఇక రాజకీయాలకు దూరమవుతారనే టాక్‌ వినిపించింది. ఇప్పుడు తాజాగా ఆ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆమె మాటలు వింటే ఆ టాక్‌కు మరింత బలాన్ని ఇస్తున్నాయని అంటున్నారు. ఓ పవర్‌ఫుల్‌ పాత్రను పోషించిన లేడీ సూపర్‌స్టార్‌.. ఈ చిత్రం హిట్‌ అయితే ఇక సినిమాల్లో సెటిల్‌ అయిపోవడం ఖాయమంటున్నారు. ట్రైలర్‌ చూసిన తర్వాత ఆమెలో ఇప్పటికీ గ్రేస్‌ తగ్గలేదంటున్నారు. కాబట్టి అవకాశాలు తప్పకుండా తలుపు తడతాయని, ఆమె కోసం సినిమాల్లో పాత్రలు సిద్ధం చేస్తారని అంటున్నారు.

సినిమాలపైనే ఫుల్ ఫోకస్ :
రాజకీయాల్లో అప్పుడే చురుగ్గా ఉన్నట్టు కనిపిస్తారు.. ఆ తర్వాత అసంతృప్తితో రగిలిపోతుంటారు.. విజయశాంతి రాజకీయ ప్రస్థానం గమనిస్తే అర్థమయ్యేదింతే. ఆమె అసంతృప్తి ఎందుకన్నది ఎవరికీ అర్థం కాదంటారు. బాగా ఊపు మీద ఉన్నట్టు కనిపిస్తారు.. సడన్‌గా సైలెంట్‌ అయిపోతారు. ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయిపోయిన విజయశాంతి.. ఇక సినిమాల మీదనే ఫుల్‌ ఫోకస్‌ పెడతారని అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ అదరగొడతారో.. మళ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల వైపు చూస్తారో.. తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్‌ తర్వాత ఆమెకు వచ్చే అవకాశాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.