తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం..!

  • Published By: sreehari ,Published On : August 25, 2020 / 08:52 PM IST
తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం..!

గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్‌గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

విపక్ష పార్టీల నేతలు కూడా ఓ అడుగు ముందుకు వేసి సీఎం కేసీఆర్‌పై విమర్శలు సంధిస్తూనే కేటీఆర్‌ను సీఎంని చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. అధికార పార్టీలో యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేతలంతా కేటీఆర్ చుట్టే తిరగడం మొదలు పెట్టారు.



పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న కేటీఆర్.. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అంతే బిజీగా మారిపోయారు. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలివిడతలో మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌కు అవకాశం దక్కలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణకు ముందుగా పార్టీ నేతలు కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నేతలంతా కేటీఆర్ కేబినెట్‌లో లేకపోవడంతో పెద్ద దిక్కు ఎవరన్న వాదన తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌కు మంత్రివర్గంలో స్థానంతో పాటు పురపాలక, పరిశ్రమల శాఖలు దక్కాయి. గ్రేటర్ ఎమ్మెల్యేల డిమాండ్ అప్పుడు అలా నెరవేరింది.



ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు క్రమంగా కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ మొదలు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్… మాట్లాడుతూ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయగా తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉమ్నాయని చెబుతున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఎప్పటి నుంచో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

ఈ అంశాలన్నీ పరిశీలించినట్లయితే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారన్న చర్చ పార్టీలో మరోసారి మొదలైంది. వ్యూహాత్మకంగానే అటు ప్రజలను, ఇటు పార్టీ వర్గాలను, ప్రతిపక్షాలను కూడా ప్రిపేర్‌ చేయడంలో భాగంగానే పార్టీ పరంగానే ఈ డిమాండ్లను తెర మీదకు తీసుకు వస్తున్నారనే వాదనలున్నాయి.



ఇటీవల కేటీఆర్‌ జోరు కూడా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమస్య ఉన్న చోట వాలిపోతున్నారు. మంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయని అంటున్నారు.

ఇవన్నీ చూసిన తర్వాతే తొందర్లోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. మరి కొంతమంది నేతలు మాత్రం సీఎంగా కేసీఆర్‌ ఈ టర్మ్ మొత్తం కచ్చితంగా కొనసాగుతారని అంటున్నారు. చూడాలి మరి అధినేత కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?