కూటమి రాజకీయాలు : బాబు వ్యూహం ఏమిటో

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 01:30 AM IST
కూటమి రాజకీయాలు : బాబు వ్యూహం ఏమిటో

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో రానుండడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి. చెన్నైలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌..డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కలిసిన మరుసటి రోజే… డీఎంకే దూతగా దొరై మురుగన్ అమరావతి వచ్చారు. చంద్రబాబును కలిసి కేసీఆర్‌ ప్రతిపాదనలపై చర్చించారు.

బాబు ఇప్పటికే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడంలో బిజీగా ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు సైతం వెళ్లి ప్రచారం నిర్వహించారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ మోడీకి వ్యతిరేకంగా పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత… చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం ఆయా ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి… ఫెడరల్ ఫ్రంట్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.

అయితే కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిసిన తర్వాత… ఆయా పార్టీలకు చెందిన నాయకులు వచ్చి చంద్రబాబును కలుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. గతంలో కేసీఆర్‌ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిసిన వెంటన… ఆ పార్టీ కీలకనేత సౌమ్యరంజన్ అమరావతికి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజాగా ఇదే తరహలో దొరై మురుగన్ డీఎంకే ప్రతినిధిగా చంద్రబాబును కలవడం హట్ టాపిక్‌ మారింది.

మే 23న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. తర్వాత బీజేపీయేతర శక్తులన్నీ సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో చూడాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.