మురళీమోహన్‌కు ఏమైంది..?

  • Published By: chvmurthy ,Published On : March 6, 2019 / 01:42 PM IST
మురళీమోహన్‌కు ఏమైంది..?

   రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్‌లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మోహన్ నిర్ణయం తూర్పుగోదావరి టీడీపీలో కలకలం రేపుతోంది. 

టీడీపీ సీనియర్ నేత, సినీ ప్రముఖుడు మురళీ మోహన్ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పడం టీడీపీ వర్గాలను ఆందోళనలో ముంచుతోంది. గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో మురళీమోహన్ కీలక భూమిక పోషించారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజమండ్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి 2009లో ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ రెండోసారి 2014లో మాత్రం ఘన విజయం సాధించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బలమైన నేతగా మురళీమోహన్ బరిలో ఉంటారని అంతా భావించారు. ఐతే ఆయన అనూహ్యంగా తాను పోటీ చేయలేనంటూ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మురళీమోహన్ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు గానూ కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్యంతో పోటీ చేయలేనని ప్రకటించారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీ మారిపోయారు. ఇప్పుడు రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ సైతం తనకు ఆసక్తి లేదని చెప్పడంతో టీడీపీ కొత్త నేతల కోసం వెదుకులాట సాగించాల్సి వస్తోంది. నటుడిగా మురళీ మోహన్ తెలుగు ప్రజలకు చిరపరితుడు. ఇక ఆయన జయభేరి గ్రూప్ సంస్థల గురించి కూడా తెలియని వారుండరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయన సినీ పరిశ్రమలో రాణించి తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టారు. తర్వాత టీడీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా తన ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడం సందేహాలకు తావిస్తోంది.
మురళీ మోహన్ మాత్రం తనపై అనుమానాలు అవసరం లేదంటున్నారు. సొంత ట్రస్ట్ ముందుకు సాగకపోవడంతోనే తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు చెబుతూనే తనపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవని ప్రకటించారు. తన వ్యాపారాలన్నీ సక్రమంగానే సాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

పార్టీ అధినేత చంద్రబాబుకి సైతం తన నిర్ణయం చెప్పేయడంతో మురళీ మోహన్ స్థానంలో కొత్త నేత కోసం టీడీపీ మళ్లీ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండే రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు చాలామంది సీనియర్లు సైతం ముందుకు రావడం లేదు. ఈ నియోజకవర్గం నుంచి బొడ్డు భాస్కరరామారావు పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన కూడా తనకు ఇష్టం లేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త ముఖాలు తెరమీదకు రావడం ఖాయంగా ఉంది. అల్లూరి విక్రమాదిత్య వర్మ వంటి కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన నేతల పేర్లు వినిపిస్తున్నాయి. గన్ని కృష్ణ వంటి సీనియర్లను సైతం రంగంలో దింపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మురళీమోహన్ నిర్ణయం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదనే చెప్పవచ్చు.