Talupulamma : తలపులు తీర్చే లోవ తలుపులమ్మ

కృతాయుగంలో అగస్త్య మహర్షి జగ్జననిగా ఉన్న అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్లు చరిత్ర చెబుతుంది. మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దానిని ఆపేందుకు దక

Talupulamma : తలపులు తీర్చే లోవ తలుపులమ్మ

Lova Thalupalamma

Talupulamma : తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో జగన్మాత లలితాంబిక దేవి మరో అవతారంగా తలుపులమ్మ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటుంది. భక్తులు తలచిన తలపులు తీర్చే అమ్మకావున ఆమెను భక్తులు తలుపులమ్మగా పూజిస్తున్నారు. తునికి 8కిలోమీటర్ల దూరంలోని లోవ కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ దేవాలయం కొలువై ఉంది. దుష్ట శిక్షణ, దీనజనరక్షణ కోసం తలుపులమ్మ తల్లి దుర్గమ్మగా, ఆది పరాశక్తిగా అభీష్టప్రదాయినిగా అవతరించి ఇక్కడ సంచరిస్తుందని స్ధల పురాణం చెబుతుంది. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తితోపాడు లోవ అందాలను తిలకించేందుకు ఎక్కవ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. చూట్టూ కొండలు, పచ్చని అందాల నడుమ తలుపులమ్మ ఆలయం కొలువుదీరి ఉంటుంది.

ఈ ఆలయానికి పురాణగాధ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కృతాయుగంలో అగస్త్య మహర్షి జగ్జననిగా ఉన్న అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్లు చరిత్ర చెబుతుంది. మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దానిని ఆపేందుకు దక్షిణ భారత దేశ యాత్ర చేపట్టాడు. ఆక్రమంలోనే అమావాస్యనాడు కీకారణ్యం గుండా ప్రయాణిస్తూ సూర్యాస్తమయం వేళ సంధ్యావందనం కోసం ఆగాడు. నీటికోసం వెతికినప్పటికీ ఒక్క చుక్కనీరుకూడా కనిపించలేదు. వెంటనే అగస్త్యుడు పాతళగంగను ప్రార్ధించగా పర్వత శిఖరాలపై నుండి నీరు పైకి పెల్లుబికి వచ్చి లోయగుండా ప్రవహించింది. సంధ్యావందనాన్ని ముగించుకుని ఆరాత్రికి అక్కడే బసచేశాడు.

మరునాడు ఉదయం ఓ చెట్టు వద్ద ఉన్న బండరాయిపై విశ్రమించిన అగస్త్యుడు పైకి చూడగా ఒక తీగ కనిపించింది. దానిని తాకటంతో చెట్టు నుండి మధుర ఫలాలు క్రింద పడ్డాయి. వాటిని ఆరగించిన తదనంతరం కొండలోయలో నుండి పెద్ద కాంతి దర్శన మిచ్చింది. అందులో నుండి జగజ్జనని లలితాంబికా దేవి ప్రత్యక్షమైందట. ఆదిశక్తికి అగస్త్యుడు పూజలు నిర్వహించి ప్రార్ధించాడని పురాణ గాధ చెబుతుంది. మానవులకు ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మగా ఈ అటవీ ప్రాంతంలోనే ఉండాలని కోరాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ఇక్కడే సంచరిస్తానంటూ జగన్మాత అదృశ్యమైందట.

ఆనాటి నుండి అమ్మరారిని ఈ ప్రాంత భక్తులు పూజించటం ప్రారంభించారు. మనస్సులో కోరుకునే తలపులను తీర్చే అమ్మగా ఆమెను తలుపులమ్మ పేరుతో భక్తులు పూజించటం మొదలు పెట్టారు. క్రమానుగతంగా ఈ ప్రాంతం లోయగా, అనంతర కాలంలో లోవగా రూపాంతరం చెందింది. రెండు దశాబ్ధాల క్రితం ఈ తలపులమ్మ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి ప్రస్తుతం రహదారి సౌకర్యం ఉంది. ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే వాటిని ముందుగా లోవ తలుపులమ్మ ఆలయానికి తీసుకువచ్చే ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాతనే వాటిని వినియోగించటం ఆనవాయితీగా వస్తుంది. తుని నుండి ఈ ఆలయానికి వెళ్లేందుకు రవాణా సౌలభ్యం ఉంది.