Samatha Kumbh 2023: వైభవోపేతంగా సమతా కుంభ్‌ విశేష ఉత్సవం

Samatha Kumbh 2023: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ 2023 వైభవోపేతంగా జరుగుతోంది.

Samatha Kumbh 2023: వైభవోపేతంగా సమతా కుంభ్‌ విశేష ఉత్సవం

Samatha Kumbh 2023: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ 2023 వైభవోపేతంగా జరుగుతోంది. ఐదో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నిత్య కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది. భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్‌ స్వామివారు తీర్థం అనుగ్రహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పూర్ణాహుతి, బలిహరణ జరిగింది.

విశేష ఉత్సవంలో భాగంగా వసంతోత్సవం కనులపండువగా జరిగింది. ఉదయం పదకొండున్నర గంటలకు వసంతోత్సవం జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. శాంతి కళ్యాణ మహోత్సవం జరిగే విధానం భక్తులను ఆకట్టుకుంది. వేదిక మీద యాలకులు, పచ్చ కర్పూరం, వట్టి వేరు ప్రధానంగా పసుపు… ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం చేయడమే వసంతోత్సవం. ఆదివారం 108 దివ్యదేశాల్లోని పెరుమాళ్లు కల్యాణోత్సవం చేయించుకున్నారు. కల్యాణ తర్వాత దంపతులు ఆనంద కోలాహలంగా జరిపించుకునే ఉత్సవమే వసంతోత్సవం. పరిమళ ద్రవ్యాలను ప్రత్యేకంగా తయారు చేసుకుని స్వామికి సమర్పించారు. వసంతోత్సవం సందర్భంగా సమతా సన్నిధిలో అర్చకులు, భక్తులు తెగ సందడి చేశారు. భక్తులంతా హోలీ పండుగలా జరుపుతున్నారు. ఆ తర్వాత భక్తి పాటలకు నృత్యాలు చేశారు.

సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మైహోమ్‌ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు ఇదియా నృత్య ప్రదర్శన ఇచ్చారు. మిత్ర బృందంతో కలిసి ఇదియా… శ్రీరామానుజ అనే పాటకు నృత్య ప్రదర్శన చేశారు. ఆమె నృత్య ప్రదర్శన చూసిన ప్రేక్షకులు అభినందనలతో ముంచెత్తారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి కూచిపూడి నృత్య బృందానికి మంగళ శాసనాలు అందించారు. ఆ తర్వాత సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ సేవతో పాటు 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు. అనంతరం నిత్యాపూర్ణాహుతి నిర్వహించారు. తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఐదో రోజు సమతా కుంభ్‌ కార్యక్రమాలు ముగిశాయి.