Yadadri: ఆరేళ్ల ఎదురుచూపులు ఫలించిన వేళ.. యాదాద్రీశుడి నిజ రూప దర్శనం పునః ప్రారంభం

యాదాద్రి క్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిజ రూప దర్శనం.. పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. ఈ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Yadadri: ఆరేళ్ల ఎదురుచూపులు ఫలించిన వేళ.. యాదాద్రీశుడి నిజ రూప దర్శనం పునః ప్రారంభం

Yadadri

Yadadri: శ్రీకరుడు, శుభకరుడు, ప్రణవ స్వరూపుడు అయిన యాదాద్రి నారసింహుడి భక్తుల ఎదురు చూపులు ఫలించాయి. ఆరేళ్లుగా కొనసాగిన ఆలయ పునర్నర్మాణ పనులు పూర్తయిన తరుణంలో.. కాసేపటి క్రితమే స్వామివారి నిజరూప దర్శనం పునఃప్రారంభమైంది. ఆరేళ్లుగా.. బాలాలయంలోనే భక్తులను దర్శనమిచ్చిన స్వామివారు.. ఇప్పుడు గర్భగుడిలో సాక్షాత్కరిస్తూ.. అభయమిస్తున్నారు. పునర్నిర్మాణం చేసుకున్న ఆలయంలో.. నారసింహుడి వైభవాన్ని చూసి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతున్నారు.

Yadadri : యాదాద్రికి ప్రత్యేక పాలక మండలి

ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కుటుంబసమేతంగా క్రతువులో పాల్గొన్న కేసీఆర్.. వేడుకలోని ప్రతి ఘట్టంలో పాలుపంచుకున్నారు. విమాన గోపురంపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇతర గోపురాలపై.. మంత్రులు పూజలు చేశారు. ప్రధాన స్థపతి సౌందరరాజన్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఈవో గీతారెడ్డి, రుత్విజులు, పూజారులను ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా సన్మానించారు. ఆలయ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగమైన వారందరినీ అభినందించారు. అనంతరం.. వైటీడీఏ, యాదాద్రి ఆలయ దేవస్థానం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. వైస్ చైర్మన్ కిషన్ రావ్, ఈవో గీతారెడ్డి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రికి పండితులు మహదాశీర్వచనం చేశారు.

Read More: Yadadri Temple : అద్భుత శిల్పకళా సౌందర్యం యాదాద్రి

అంతకుముందు.. తన కుటుంబీకులతో కలిసి సీఎం కేసీఆర్.. నేటి మహా కుంభ సంప్రోక్షణకు హాజరయ్యారు. నుదుటన తిలకంతో.. పంచెకట్టుతో భక్తి భావాన్ని చాటారు. బాలాలయం నుంచి అర్చకులు నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. కార్యక్రమం అంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. అంతా కలిసి గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్నారు. పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం.. భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది.

భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ముందు జాగ్రత్తగా అనూహ్య ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు సైతం భారీ భద్రత మోహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రులు సైతం తరలిరావడం.. ఇతర రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించడంతో.. పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాలతో భద్రతను పర్యవేక్షించారు.

Read More: Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

ఆంధ్రప్రదేశ్ కు తిరుమల మాదిరిగా.. తెలంగాణకు యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టి.. ఆరేళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగించారు. శాస్త్రోక్తమైన ప్రణాళిక రూపొందించుకున్నాకే.. యాదాద్రిపై ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. నవ నారసింహ క్షేత్రాలు నిర్మించారు. మెట్ల మార్గాన్ని పునరుద్ధరించారు. భక్తులతో పాటుగా.. యాదాద్రిని సందర్శించే ప్రముఖులకు అందుబాటులో ఉండేలా కాటేజీల నిర్మాణాలు కూడా చేపట్టారు. సకల సౌకర్యాలతో.. ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లేందుకు.. యాదాద్రిలో అన్ని చర్యలను తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పనులు పురోగతిని పరిశీలించేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తూనే ఉన్నారు. ఆరేళ్ల శ్రమ తర్వాత.. ఇవాళ తిరిగి ఆలయంలో నారసింహుడి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఇకపై.. ఆలయంలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.. వాటి ప్రక్రియ ఎలా ఉంటుంది.. అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. స్వయంభువుగా కొలువైన యాదాద్రీశుడిని దర్శించుకోవాలన్న ఆరాటం.. భక్తుల్లో పెరుగుతోంది. రానున్న రోజుల్లో.. భక్త జన సంద్రంగా యాదాద్రి ఆధ్యాత్మిక శోభ వెదజల్లడం.. ఖాయంగా కనిపిస్తోంది.