ధోనీని చెన్నై సెలెక్ట్ చేసుకున్నప్పుడు షాకయ్యాను, ఇప్పటికీ బాధ కలుగుతుంది

  • Published By: sreehari ,Published On : April 24, 2020 / 02:39 AM IST
ధోనీని చెన్నై సెలెక్ట్ చేసుకున్నప్పుడు షాకయ్యాను, ఇప్పటికీ బాధ కలుగుతుంది

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిగింది గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. నాడు జరిగిన ఘటన తనను షాక్ కు గురి చేసిందన్నాడు. ఇప్పటికీ తనకు బాధ కలుగుతుందని వాపోయాడు. అసలేం జరిగిందంటే, ఐపీఎల్ తొలి సీజన్​-2008 కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసుకున్న సమయంలో తాను ఆశ్చర్యానికి గురయ్యానని దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఆ సమయంలో తాను తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆడగాడినని, చెన్నై తన కోసం పోటీ పడకపోవడం కాస్త బాధించిందని గురువారం(ఏప్రిల్ 24,2020) ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ వెల్లడించాడు.

13 సంవత్సరాలైంది.. ఇంకా చెన్నై నుంచి కాల్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నా:
“2008లో నేను ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ఐపీఎల్ వేలంలో జరిగింది. నేను అప్పుడు తమిళనాడులో ప్రముఖ క్రికెటర్​ను, అందునా టీమిండియా తరఫున ఆడుతున్నా… చెన్నై సూపర్ కింగ్స్ నన్ను తప్పకుండా జట్టులోకి తీసుకుంటుందని అనుకున్నా. అయితే కెప్టెన్సీ ఇస్తారా లేదా అన్నదే నాకు సందేహంగా ఉండేది. కానీ తొలుత వారు 1.5మిలియన్ డాలర్లకు ధోనీని తీసుకున్నారు.

ఆ సమయంలో మహీ నా పక్కనే ఉన్నాడు. చెన్నై తనను తీసుకుంటున్నట్టు నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. మరి అతడికి తెలుసో లేదో. అయితే ఆ తర్వాత చెన్నై నన్ను ఎంపిక చేసుకుంటుందని అనుకున్నా. కానీ అలా జరుగకపోవడం నా మనసును బాధించింది. ఇప్పటికి 13 సంవత్సరాలైంది.. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్​ నుంచి పిలుపొస్తుందేమోనని ఎదురుచూస్తున్నా” అని కార్తీక్ చెప్పాడు.

తొలి సీజన్ లో రూ.6కోట్లకు ధోనిని దక్కించుకున్న చెన్నై:
తొలి సీజన్ కోసం జరిగిన వేలంలో 1.5మిలియన్ డాలర్లు(అప్పటికి సుమారు రూ.6కోట్లు) వెచ్చించి ధోనీని చెన్నై దక్కించుకుంది. అప్పుడు ధోనీయే అత్యంత విలువైన ఆటగాడు. ఐపీఎల్​లో కార్తీక్ ఢిల్లీ డేర్​డేవిల్స్​(ఇప్పుడు కాపిటల్స్​), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్​, ముంబై ఇండియన్స్​కు ఆడగా.. ప్రస్తుతం కోల్​కతా నైట్ రైడర్స్​ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. 

తమ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చిన ఫ్రాంచైజీలు:
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ లోకంలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఎందరో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకొనేందుకు ఐపీఎల్‌ ఒక మంచి వేదికగా నిలిచింది. అయితే ఆరంభ సీజన్లలో ఫ్రాంచైజీలు తమ ప్రధాన ఆటగాళ్ల ఎంపికలో తమ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చాయి. కోల్‌కతా జట్టు గంగూలీని, ఢిల్లీ వీరేంద్ర సెహ్వాగ్, ముంబై సచిన్ టెండూల్కర్‌లకు తమ జట్టులో చోటు కల్పించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు వెళ్లింది. తమిళనాడు ఆటగాడు దినేశ్ కార్తీక్‌ను పక్కన పెట్టి.. రాంచీకి చెందిన ధోనీని జట్టులోకి తీసుకుంది. 

దినేశ్ కోరిక నెరవేరుతుందా:
దినేశ్ కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. కొంత చర్చకు దారితీశాయి. ఈ మాటలు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చెవిన పడ్డాయో లేదో. ఇప్పటికైనా వారు దినేశ్ కార్తీక్ మొర ఆలకిస్తారో లేదో. భవిష్యత్తులో సీఎస్కేకు ఎంపిక అవుతాడో లేదో చూడాలి. చెన్నైకి ఆడాలనే దినేశ్ కోరిక నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.