WTC 21 Final : ఫైనల్ విజేత ఎవరు?, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. అజింక్యా రహానె వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

WTC 21 Final : ఫైనల్ విజేత ఎవరు?, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్

Wtc

India VS New Zealand : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. అజింక్యా రహానె వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఇద్దరూ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో వారికి చోటు కల్పించింది.

2021, జూన్ 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రెండేళ్ల పాటు జరిగిన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. కరోనా మహమ్మారి రాకముందు వరకు ఈ జాబితాలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగగా ఆ తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లలో విజయం సాధించిన భారత్ ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ అంతకుముందే ఫైనల్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 59 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్ 12 విజయాలతో సరిపెట్టుకుంది. 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మొత్తంగా ఇరు జట్లు 21 సిరీస్‌లు ఆడాయి. టీమిండియా 11, న్యూజిలాండ్ ఆరింటిలో విజయం సాధించాయి. నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, తటస్థ వేదికపై ఇరు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇదే తొలిసారి. ఇటీవల భారత జట్టు 15 మ్యాచులు ఆడితే ఏడింటిలో విజయం సాధించింది.

అయితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణ గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనాను పరిశీలిస్తే రిజర్వ్‌ డే సహా ఫైనల్‌కు వర్షం అంతరాయం తప్పదు. ఈనెల 19, 20, 22 తేదీలలో వర్షం పడే అవకాశముందని చెబుతోంది. 18, 21 తేదీల్లో వానకు అవకాశం లేకపోయినా ఆ రెండు రోజులు పూర్తిగా ఎండమాత్రం ఉండ అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. రిజర్వ్‌ డే రోజు కూడా వరుణుడు అడ్డుకొనే అవకాశముందని అంటోంది.