లాస్ట్ పంచ్ మనదైతే: మూడో వన్డేలో ఆసీస్ వర్సెస్ భారత్

లాస్ట్ పంచ్ మనదైతే: మూడో వన్డేలో ఆసీస్ వర్సెస్ భారత్

రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ పతనాన్ని శాసించిన టీమిండియా అదే జోరుతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌‌ను 1-1సమం చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొట్టనుంది. హోరాహోరీగా సాగనున్న పోరు భారీ స్థాయిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలి వన్డేలో ఆసీస్‌ కాస్త తటపటాయించిన మాట వాస్తవమే. 

ఆ మ్యాచ్ ఫలితం ఆధారంగా ఆసీస్ ను అంచనా వేయలేం. కొంచెం ఆరంభంలో పుంజుకుంటే భారత్‌లో వరుసగా రెండో వన్డే సాధించగల సత్తా ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఏమేర అడ్డుకోగలదా అనే సందేహాలు తలెత్తాయి. రాజ్‌కోట్‌లో ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌.. ధీటుగానే బదులిచ్చేట్లు కనిపిస్తుంది. కొత్తగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌.. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ శుభారంభాన్నివ్వగా.. తిరిగి మూడో స్థానంలో దిగిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా సత్తా చాటాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ తిరిగి నాలుగో స్థానంలో వచ్చాడు. చిన్నస్వామి స్టేడియంలోనూ ఇదే బ్యాటింగ్‌ లైనప్‌  కొనసాగే అవకాశముంది.

చిన్నస్వామి స్టేడియంలో మూడు వన్డేల్లో కలిపి డబుల్‌ సెంచరీ సహా 318 పరుగులు చేసిన రికార్డు రోహిత్‌ పేరిట ఉంది. ఓపెనర్లతో పాటు రాహుల్‌ అద్భుత ఫామ్‌ భారత్‌కు అదనపు బలంగా మారింది. పైగా సొంత మైదానంలో ఆడబోతున్నాడు. వీరందరికీ కెప్టెన్‌ కోహ్లి బ్యాటింగ్‌ తోడైతే భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. వన్డే జట్టులో స్థిరపడే ప్రయత్నంలో ఉన్న అయ్యర్‌ రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఇప్పుడైనా అయ్యర్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. 

మనీశ్‌ పాండేకు కూడా మరో అవకాశం దక్కవచ్చు. పంత్‌ ఫిట్‌నెస్ సాధిస్తేనే మ్యాచ్ లో ఉంటాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో రాహుల్‌ చక్కటి కీపింగ్‌ తర్వాత ఇదే జట్టును భారత్‌ కొనసాగించే అవకాశం ఉంది. రెండో వన్డేలో భారత బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబర్చారు. బుమ్రా తొలి స్పెల్‌ చూస్తే మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్‌కే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

పిచ్: 
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.  

తుది జట్లు(అంచనా)
టీమిండియా:
కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పాండే, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, బుమ్రా. 
ఆ్రస్టేలియా: ఫించ్‌ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, టర్నర్, క్యారీ, అగర్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, జంపా.