IPL New Teams: కళ్లు చెదిరే ధరకు.. ఐపీఎల్‌లో మరో రెండు జట్లు!

క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

IPL New Teams: కళ్లు చెదిరే ధరకు.. ఐపీఎల్‌లో మరో రెండు జట్లు!

Ipl

IPL New Teams Auction: క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. ఐపీఎల్ వచ్చే ఏడాది మరింత రంజుగా ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో 8 టీమ్‌లు ఉండగా.. మరో రెండు టీమ్‌లు ఐపీఎల్‌లో చేరనున్నాయి. ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి.

ఐపీఎల్ బరిలోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు వచ్చి చేరాయి. కళ్లు చెదిరే మొత్తాన్ని చెల్లించి ఈ టీమ్‌లను బడా సంస్థలు దక్కించుకున్నాయి. గోయంకా గ్రూప్‌, సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ బిడ్‌ విజేతలుగా నిలిచాయి. 7వేల 90కోట్లు చెల్లించి లక్నో జట్టును RPSG గ్రూప్‌ దక్కించుకుంది. సంజీవ్‌గోయంకా నేతృత్వంలోని RPSG గ్రూప్‌ నడుస్తోంది.

ఇక అహ్మదాబాద్‌ జట్టుకు సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ 5వేల 625 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. బేస్‌ప్రైస్‌ 2వేల కోట్ల రూపాయలు కాగా.. భారీ మొత్తానికి బిడ్లు వేశారు. పదిలక్షలు చెల్లించి మొత్తం 28బిడ్ అప్లికేషన్లు తీసుకున్నారు. చివరకు 10మంది మాత్రమే బిడ్లు వేశారు. ఈ రెండు కంపెనీలు విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్లతో బీసీసీఐకి 12వేల 715 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది.

ఐపీఎల్‌- 2022లో బరిలో 10జట్లు పోటీపడతాయని ఇంతకుముందే బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వాటిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్‌ హైదరాబాద్‌లు పోటీ పడుతున్నాయి. కొత్తగా అహ్మదాబాద్‌, లక్నో జట్లు వచ్చి చేరాయి.

గత ఐపీఎల్‌ సీజన్స్‌లో కొన్ని జట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. వాటిలో డెక్కన్‌ ఛార్జర్స్‌ 2008 నుంచి 2012 వరకు కొనసాగింది. కోచి టస్కర్స్‌ 2011లో నిష్క్రమించింది. పుణె వారియర్స్‌ 2011 నుంచి 2013 వరకు, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ 2016 నుంచి 2018 వరకు, గుజరాత్‌ లయన్స్‌ 2016 నుంచి 2018 వరకు ఆయా సీజన్స్‌లో ఆడి తర్వాత నిష్క్రమించాయి.

RPSG గ్రూప్‌ గతంలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టును నిర్వహించింది. అయితే అది రెండేళ్ల కాంట్రాక్ట్‌ మాత్రమే. అప్పట్లో చెన్నై, రాజస్థాన్‌ జట్లపై నిషేధం ఉండగా.. ఆ సమయంలో పుణె, కేరళ జట్లను తాత్కాలికంగా ప్రకటించారు ఐపీఎల్ నిర్వాహకులు. ఆ సమయంలో గోయంకా గ్రూప్‌ పుణె జట్టును సొంతం చేసుకుంది. ఈసారి పూర్తిస్థాయి జట్టును గెలుచుకుంది.