T20 World Cup: బీసీసీఐకి ఖచ్చితమైన ప్రణాళిక లేదు.. ప్రపంచకప్ యూఏఈలోనే?

కరోనా సంక్షోభంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ ఏడాది జరగబోయే T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)కి సమయం ఇచ్చింది.

T20 World Cup: బీసీసీఐకి ఖచ్చితమైన ప్రణాళిక లేదు.. ప్రపంచకప్ యూఏఈలోనే?

T20 World Cup

BCCI: కరోనా సంక్షోభంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ ఏడాది జరగబోయే T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)కి సమయం ఇచ్చింది. అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సిన ప్రపంచకప్ ఒకవేళ భారతదేశంలో జరగకపోతే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచ కప్ జరగనుండగా.. హోస్టింగ్ హక్కులు బీసీసీఐకే ఉన్నాయి. బీసీసీఐ వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవటానికి ఇష్టపడట్లేదు. ఈ క్రమంలోనే ఐసిసి బోర్డు సమావేశంలో, భారతదేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా టీ20 ప్రపంచ కప్‌పై ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులపై నిర్ణయం తీసుకోవడానికి జులై ఒకటవ తేదీ వరకు సమయం కోరింది. అయితే, బీసీసీఐకి ఐసిసి బోర్డు జూన్ 28వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది.

ఈ క్రమంలో దేశంలో ప్రపంచకప్ నిర్వహించే పరిస్థితులపై ఆలోచనలు చేస్తుంది బీసీసీఐ. ముంబైలోని మూడు స్టేడియంలతో పాటు పూణేలో ప్రపంచ కప్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్లాన్‌లు ఉన్నప్పటికీ, బీసీసీఐకి ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో టీ20 ప్రపంచ కప్ జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ప్రపంచ కప్‌ను బీసీసీఐ యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్ యూఏఈలో జరిగితే.. దుబాయ్, షార్జా మరియు అబుదాబిలోని మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగవచ్చు.

టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వలేకపోతే, UAE దాని ప్రత్యామ్నాయ వేదికగా ఉంటుందని ఐసిసి బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. ఐసీసీ బోర్డు ఒమన్‌లోని మస్కట్‌ను ప్రత్యామ్నాయ వేదికగా చూస్తోందని, అక్కడ టీ20 ప్రపంచ కప్ ప్రాధమిక రౌండ్ మ్యాచ్‌లను నిర్వహించగలదని చెబుతుంది. ఏదేమైనా, ఈ సంవత్సరం ఈ ప్రపంచ కప్ నిర్వహించాలని గట్టిగా నిర్ణయించుకుంది ఐసీసీ.