బీఫ్‌ తినేవారి విరాళం అయోధ్యకు వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్..ఓయూ విద్యార్థుల మండిపాటు

బీఫ్‌ తినేవారి విరాళం అయోధ్యకు వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్..ఓయూ విద్యార్థుల మండిపాటు

BJP MLA Rajasingh’s sensational comments : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోవద్దని వ్యాఖ్యానించారు.

పాతబస్తీలో జరిగిన ఒక బహిరంగసభలో రాజాసింగ్ మాట్లాడుతూ.. భారత్‌ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేయని వారి నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదని పిలుపునిచ్చారు. పూలు అయినా, పండ్లు అయినా ఏ వస్తువైనా కూడా కొనకూడదని సూచించారు.

రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ దళితులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

బీఫ్‌ తినేవారిని సామాజికంగా వెలివేయాలంటూ రాజాసింగ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రాజాసింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.