బీజేపీ దూకుడు : తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ పర్యటన షెడ్యూల్

బీజేపీ దూకుడు : తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ పర్యటన షెడ్యూల్

BJP TS in-charge Tarun Chugh : తెలంగాణలో ఎన్నికల ప్రిపరేషన్స్‌లో బీజేపీ వేగం పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. బండి సంజయ్‌ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించగా…ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ మూడు రోజుల పర్యటన ఖరారైంది. తరుణ్‌చుగ్‌ టూర్‌ పార్టీకి కలసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మంలో ఆయన మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

నిజామాబాద్ లో పర్యటన : –
2021, జనవరి 07వ తేదీ గురువారం హైదరాబాద్‌కు చేరుకోనున్న తరుణ్‌చుగ్‌… బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అనంతరం నిజామాబాద్‌ పర్యటనకు వెళ్తారు. మొదట ఇందల్వాయి చేరుకుని.. అక్కడి నుంచి ర్యాలీగా డిచ్‌పల్లికి వెళ్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం బోధన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఖమ్మం, వరంగల్ లో : –
2021, జనవరి 08వ తేదీ శుక్రవారం, జనవరి 09వ తేదీ శనివారం త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే ఖమ్మం, వరంగల్‌లో తరుణ్‌చుగ్‌ పర్యటించేలా టూర్‌కు ప్లాన్‌ చేశారు. రెండుచోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్‌లో పర్యటిస్తారు. వీవీసీ ఫంక్షన్‌ హాల్‌లో ఇంటలెక్చువల్స్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత శక్తి కేంద్రాలు, బూత్‌ కమిటీ అంతర్గత సమావేశాలు, సాయంత్రం పదాధికారులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీలో చేరికలు : –
9వ తేదీన వరంగల్‌ కార్పొరేషన్‌లో తరుణ్‌చుగ్‌ పర్యటిస్తారు. వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్‌ వరంగల్‌ పీఠంపై కాషాయజెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ కార్పొరేటర్లు కొందరు బీజేపీ చేరారు. మరికొంత మంది ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. తరుణ్‌చుగ్‌ సమక్షంలో వారంతా బీజేపీ కండువా కప్పుకునే అవకాశముంది. మొత్తానికి తరుణ్‌చుగ్‌ టూర్‌తో మరింత బలపడాలని బీజేపీ వ్యూహాలు రూపొందిస్తుంది. మరి ఆయన పర్యటన ఆ పార్టీకి ఎంతమేరకు ప్రయోజనం చేకూర్చుతుందో చూడాలి.