UK To Telangana : 18 మందికి కరోనా, 180 మంది ఎక్కడ ?

UK To Telangana : 18 మందికి కరోనా, 180 మంది ఎక్కడ ?

britain

britain to telangana : కరోనా వైరస్‌ ధాటికి బ్రిటన్‌ వణికిపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి కేసులు నమోదవుతుండగా.. తాజాగా కొత్త రకం కరోనా విరుచుకుపడుతోంది. ఈ దేశం నుంచి వచ్చిన వారి వివరాలు రాబట్టేందుకు భారతదేశంలోని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. వివరాలు తెలియచేయాలని, హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ..కొంతమంది ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. యూకే నుంచి తెలంగాణ రాష్ట్రానికి పలువురు వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే..యూకే నుంచి ఎంతమంది వచ్చారనే దానిపై క్లారిటీ తెలవడం లేదు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

మరో ఇద్దరికీ కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తంగా 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వీరికి కాంటాక్ట్ అయిన ముగ్గురికి కూడా కరోనా సోకిందని తేలింది. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను సీసీఎంబీకి అధికారులు పంపారు. యూకే నుంచి వచ్చిన 1216 మందిలో 937 మంది గుర్తించగా..184 మంది వివరాలు తెలియడం లేదు.  డిసెంబర్ 09వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పలువురు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం 16 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం 184 మందికి సంబంధించిన వివరాలు తెలియడం లేదు. వీరి ఫోన్లు స్విచ్చాఫ్ ఉండడం, వీరు ఎంతమందిని కలిశారనే దానిపై..అధికారుల్లో ఆందోళన నెలకొంది.

కరోనా వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి పంపించామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారాయన. డిసెంబర్ 09వ తేదీ తర్వాత.. రాష్ట్రానికి నేరుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారు లేదా బ్రిటన్ మీదుగా ప్రయాణించిన వారు దయచేసి వారి వివరాలను (040-24651119, 9154170960)కి వాట్సాప్ ద్వారా తెలియచేయాలని సూచించారు. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ..అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలని సూచించారు.