గుడ్ న్యూస్, తెలంగాణలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లకు కేంద్రం అనుమతి

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 08:13 AM IST
గుడ్ న్యూస్, తెలంగాణలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లకు కేంద్రం అనుమతి

ఎలక్ట్రికల్‌ వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఎట్టకేలకు అనుమతిచ్చింది. 2020 చివరికల్లా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో 178 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. సెంట్రల్‌ హెవీ ఇండస్ట్రీస్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంత్రిత్వశాఖ నుంచి ఈ మేరకు సమాచారం అందిందని, రాష్ట్రంలో వీటిని రెండు విడతలుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రెడ్కో సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలను పెంచడానికి వీలుగా కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌- ఇండియా) పథకంలో భాగంగా తెలంగాణలో 178 చార్జింగ్‌ స్టేషన్లకు అనుమతిచ్చింది.

హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో 118 చార్జింగ్ స్టేషన్లు:
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వీటికి రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ రెడ్కో) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. ఒక్కో పాయింట్‌లో ఒకేసారి కనీసం మూడు వాహనాలకు చార్జింగ్‌ చేసేలా వీటికి రూపకల్పన చేశారు. ఫేమ్‌-1 కింద 40 ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ ) చార్జింగ్‌ స్టేషన్లకు అనుమతిచ్చిందని, ఫేమ్‌-2 కింద హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ కింద 118, వరంగల్‌లో 10, కరీంనగర్‌లో 10 స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామని టీఎస్‌ రెడ్కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డీవీ రామకృష్ణకుమార్‌ తెలిపారు.

చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ ప్రభుత్వ రంగ సంస్థలే చూసుకుంటాయి:
ఈ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ థర్మల్‌పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ), రాజస్థాన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈఐఎల్‌), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఫేమ్‌-2 కింద ఏర్పాటుచేసే స్టేషన్లలో ఎన్టీపీసీ 32, ఆర్‌ఈఐఎల్‌ 37, ఈఈఎస్‌ఎల్‌ 49 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే వరంగల్‌, కరీంనగర్‌ 20 స్టేషన్లను ఆర్‌ఈఐఎల్‌ నిర్వహించనున్నది.

200 ప్రదేశాల గుర్తింపు:
ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కోసం ఇప్పటికే హైదరాబాద్‌ క్యాపిటల్‌ రీజియన్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌లో 200 ప్రదేశాలను గుర్తించారు. వాహనాల పార్కింగ్‌ ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసేందుకు డిస్కంల సాయం తీసుకోనున్నారు. కంపెనీల నుంచి యూనిట్‌కు రూ.6 చొప్పున వసూలు చేయనుండగా.. వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని టీఎస్‌ రెడ్కో సంస్థ నిర్ణయించాల్సి ఉంది.