TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ నినాదం ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ అని ఇక ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే అని సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు.

TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

TRS To BRS

TRS To BRS : తెలంగాణ రాష్ట్ర స‌మితి (TRS)గా ఏర్పడిన పార్టీని సీఎం కేసీఆర్ కృషితో భార‌త రాష్ట్ర స‌మితి (BRS)పార్టీగా మార్చారు. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం ముఖ్యంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను రూపొందించారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు తెలంగాణ భ‌వ‌న్‌లో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని..బీఆర్ఎస్ నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్’ అని ప్రకటించారు. హైదరాబద్ లో పార్టీని ఆవిష్కరించామని డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింద‌ని..ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు..గానీ రాజ‌కీయ పార్టీలు కాద‌ంటూ తనదైన శైలిలో కేసీఆర్ ప్రసింగించారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దృష్టి అంతా రైతుల సమస్యలు, కార్మిక సమస్యలపైనేనని తెలిపారు. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాల‌ని..రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. బీజేపీ కుట్రతో సీఎం పదవి నుంచి వైదొలగిన కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎంని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై బీఆర్ఎస్ దృష్టి పెడుతుందని తెలిపారు.

BRS ఆవిర్భావంతో ఇక 21ఏళ్ల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రస్థానం ముగిసింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ ఈసీ పత్రాలపై సంతకం చేసి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధరించారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు గురువారం అధికారికంగా లేఖ అందింది. దీంతో శుక్రవారం తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ప్రకటించారు. దీంతో ఇకనుంచి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా చెలామణిలోకి వచ్చింది.బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు.