జలజగడం వాటాలు..వాదనలు, కేంద్రం తేలుస్తుందా ? నానుస్తుందా ?

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 06:50 AM IST
జలజగడం వాటాలు..వాదనలు, కేంద్రం తేలుస్తుందా ? నానుస్తుందా ?

CM YS Jagan Points in Apex Committee Meeting : జల వివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా తమ వాదనలు వినిపించాయి. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డుల పరిధిపై క్లారిటీ రానప్పటికీ.. డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లు సమర్పించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేనని, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ వ్యవహరిస్తే ఇకపై కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పగా.. తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.



కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం ఆపాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రాజెక్టులు ఆపకపోతే అలంపూర్‌- పెద్దమారూర్‌ వద్ద ఆనకట్ట నిర్మిస్తామని.. తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ వ్యవహరించొద్దని కోరారు.



తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూడొద్దని.. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు వ్యవహరిస్తే ఇకపై కుదరదని తేల్చి చెప్పారు. నదీజలాల కేటాయింపు కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని.. ఏడాదైనా స్పందించకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశామని తెలిపారు. కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌కు విధివిధానాలు ఇవ్వాలని.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావన్న కేసీఆర్‌.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని స్పష్టం చేశారు.



తమకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారాయన. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకొస్తే సహకరిస్తామని తెలిపారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ కోరారు.



ఇక ఏపీకి రావాల్సిన నీటి వాటాపై సీఎం జగన్‌ కూడా గట్టిగానే తమ వాదనలు వినిపించారు. కరవు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు సీఎం జగన్‌. తెలుగు గంగ, SRB, KC కెనాల్‌, గాలేరు-నగరి శ్రీశైలంపైనే ఆధారపడ్డాయన్నారు. తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఆ నీరే ఆధారమని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను సీఎం వివరించారు. థార్‌ ఎడారి తర్వాత అతితక్కువ వర్షపాత ప్రాంతం ఉన్న జిల్లా అనంతపురం అని.. ఎడారి అభివృద్ధి పథకం కూడా ఈ జిల్లాలో అమలవుతోందని చెప్పారు.



కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఉన్నాయని సీఎం జగన్‌ ఎపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. దుర్భిక్ష జిల్లాలకు 50 టీఎంసీల చొప్పునే నీటిని ఇవ్వగలుగుతున్నామని.. ఈ జిల్లాల్లో తాగు, సాగునీటి ఎద్దడి తీర్చాలంటే వంద టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కనీసం ఆరు వందల టీఎంసీలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలపై గతేడాది జూన్‌లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినట్లు జగన్‌ గుర్తు చేశారు.



శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించగలమని.. 44 వేల క్యూసెక్కుల పూర్తి సామర్థ్యంతో ఏడాదికి 15 రోజులే రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే అవకాశముందని సీఎం జగన్‌ తెలిపారు. సాగునీటి కోసం 3 టీఎంసీలు, విద్యుత్‌ కోసం 4 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి వినియోగించుకునేలా తెలంగాణ సామర్థ్యం పెంచుకుందని.. దీనివల్ల ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల మేర నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోయడం మినహా ఏపీకి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.



ఇక కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదేనని స్పష్టం చేశారు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌. నీటి వాటాపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, వాదనలు వినిపించాయన్నారాయన. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు షెకావత్. చాలా అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డ్ పరిధి నిర్ణయం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.



ఇకపై ఏడాదికోసారైనా అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగేలా చూస్తామన్నారు. దాదాపు రెండు గంటలు సాగిన భేటిలో నదీ జలాల అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు గట్టిగానే వినిపించాయి. అయితే అభ్యంతరాలు, వాదనలు విన్న కేంద్రం.. తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని సమస్యగా ఉన్ని జల జగడాన్ని ఇప్పటికైనా పరిష్కరిస్తుందా.. లేక ఎప్పటిలానే నానుస్తుందా అనే తేలాల్సి ఉంది.