కండోమ్ కొనేందుకు సిగ్గు పడటమే కారణం, పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు, ప్రమాదం అంచున గ్రేటర్ హైదరాబాద్

కండోమ్ కొనేందుకు సిగ్గు పడటమే కారణం, పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు, ప్రమాదం అంచున గ్రేటర్ హైదరాబాద్

condom use lowest percentage in telugu states: హెచ్‌ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫషియన్సీ వైరస్-HIV). ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతకర వ్యాధుల్లో ఎయిడ్స్‌ ప్రధానమైనది. ప్రజారోగ్యానికి ఇదో పెద్ద సవాల్. 1980లో ఎయిడ్స్‌ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోయేది. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి సైతం హెచ్‌ఐవీ సోకగానే ఒంటరి పోరు చేస్తూ నిరాశ నిస్పృహలతో చరమాంకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, నేడు వైద్యశాస్త్రం సాధించిన ప్రగతివల్ల హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలినా.. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే సాధారణ జీవనం సాగించే అవకాశముంది.

హెచ్ఐవీ కేసుల్లో జీహెచ్ఎంసీ టాప్:
హెచ్ఐవీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణం కండోమ్ వినియోగించకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. కండోమ్ కొనేందుకు, వాడేందుకు చాలామంది సిగ్గు పడుతున్నారు. ఆ సిగ్గే వేరే అనర్థాలకు దారితీస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం. అదే ఏపీలో 0.2 శాతమే ఉండగా, తెలంగాణలో 0.5శాతం మాత్రమే. హైదరాబాద్ లో గతంతో పోలిస్తే ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో జీహెచ్ఎంసీ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

సురక్షిత శృంగారంపై తెలుగువారికి అవగాహన తక్కువ:
అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగువారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ అని నివేదికలో తేలింది. కండోమ్‌ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టమైంది. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్‌ఐవీనే కాదు హెపటైటీస్-బి, సి, గనేరియా, సిఫిలిస్‌ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

పరువు భయంతో బయటకు చెప్పడం లేదు, కండోమ్ వాడటం లేదు:
అంతేకాదు చాలామందికి హెచ్‌ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు కదా అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. రక్షణ కోసం కనీసం కండోమ్‌లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో 0.2, తెలంగాణలో 0.5శాతం మందే కండోమ్ వాడుతున్నారు:
జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్‌ వాడుతున్నట్లు స్పష్టమైంది. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్‌ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్‌ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్‌ వాడుతున్నారు.

నిర్లక్ష్యం వల్లే హెచ్‌ఐవీ:

* అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్‌ఐవీ సోకుతుంది.

* గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది.

* ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం.

* కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది.

* ఒకరికి వాడిన సిరంజ్‌లు, బ్లేడ్స్‌ మరొకరికి వాడటం వల్ల వస్తుంది.

* నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

* జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

సురక్షిత శృంగారం మీతోపాటు మీ భాగస్వామికీ ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కండోమ్ వినియోగం చాలా మంచిదంటున్నారు. ఇలా చేయకపోవడం వల్ల ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.