Harish Rao : నమ్మకానికి నిదర్శనం కేసీఆర్, నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్- మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. టిక్కెట్లు అమ్ముకున్నారని గాంధీ భవన్ లో గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడం కాదు.. ముందు డిపాజిట్లు తెచ్చుకోవాలి. Harish Rao

Harish Rao : నమ్మకానికి నిదర్శనం కేసీఆర్, నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్- మంత్రి హరీశ్ రావు

Harish Rao Fires On Revanth Reddy (Photo : Facebook, Google)

Harish Rao Fires On Revanth Reddy : సిద్దిపేటలో ఈ నెల 17న జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. లక్ష్య సాధన కోసం లక్ష మందితో సభ ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వస్తారని, సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

విపక్షాల గుండెలు అదురుతున్నాయి..
”20వేల మంది స్వచందంగా మోటార్ సైకిళ్లపై వస్తారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివస్తారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫీజులు కట్ అయ్యాయి. ప్రజల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతుంటే విపక్షాల గుండెలు అదురుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మా మేనిఫెస్టోను కాపీ కొట్టారని అంటున్నారు. కాపీ కొట్టింది ఎవరు? రైతుబంధు రూపకర్త కేసీఆర్. మీరే కాపీ కొట్టి పెంచుతామన్నారు. రైతులు, పెన్షన్ దారుల గురి కేసీఆర్ పైనే. నమ్మకానికి నిదర్శనం కేసీఆర్. నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్. ప్రతి కుటుంబ పెద్ద మహిళకు 3వేలు అందించాలని సౌభాగ్య లక్ష్మి ప్రకటించారు.

మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా హ్యాట్రిక్ గెలుపు ఖాయం..
సిలిండర్ ధరను ఆకాశానికి పెంచింది బీజేపీ. పేద మహిళలకు రూ.400లకే సిలిండర్ ఇస్తాం. అన్నపూర్ణ కింద సన్న బియ్యంతో ప్రజలందరికీ అన్నం. కాంగ్రెస్ హయాంలో 20 కిలోలు సీలింగ్, అది ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే కార్యక్రమం.. అన్నపూర్ణ పథకం. విపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. టిక్కెట్లు అమ్ముకున్నారని, గాంధీ భవన్ లో గొడవలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి నాడు ఓటుకు నోటు నేడు నోటుకు సీటు. ఇటువంటి వారి చేతుల్లో పెడితే రాష్ట్రాన్ని ఉంచుతారా?

Also Read : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్

అధికారం దేవుడెరుగు.. ముందు డిపాజిట్లు తెచ్చుకోండి..
బీజేపీ అధికారంలోకి రావడం కాదు.. ముందు డిపాజిట్లు తెచ్చుకోవాలి. బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణకు ఆగర్భ శత్రువు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే 6 మండలాలను ఆంధ్రలో కలిపారు. మేమేం పని చేయకపోతే మా పథకాలు ఎందుకు కాపీ కొడుతున్నారో రాజ్ నాథ్ సింగ్ చెప్పాలి. మా రైతుబంధు, మిషన్ భగీరథ పేర్లు మార్చి కాపీ కొట్టింది మీరు కాదా? ఢిల్లీలో అవార్డులు, పార్లమెంటులో పొగడ్తలు, గల్లీలో తిట్లు.. ఇదీ బీజేపీ తీరు.

తెలంగాణ.. ఓ ట్రెండ్ సెట్టర్..
అవార్డు లేని రంగం తెలంగాణలో ఏదైనా ఉందా? దేశం మొత్తం కేసీఆర్ పథకాలు తమ మేనిఫెస్టోలో పెడుతున్నారు. తెలంగాణ ఈరోజు ట్రెండ్ సెట్టర్. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివితే నవ్వుల పాలయ్యేది మీరే. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీట్లు కావాలన్నా ఢిల్లీ పోవాలి, పదవులు కావాలన్నా ఢిల్లీ పోవాలి. ఓట్లు కావాలంటే ఢిల్లీ నుంచి నాయకులు రావాలి. స్కీమ్ లతో తెలంగాణ అభివృద్థి పథాన దూసుకెళుతోంది. స్కామ్ లతో కర్ణాటక కాంగ్రెస్ ఆగమవుతోంది. ఒక్కసారి ఛాన్స్ అని అడుగుతున్నారు. ఒక్కసారి కాదు 11సార్లు అవకాశం ఇచ్చారు. 11 టర్మ్ లలో మీరు చేయని పనిని పదేళ్లలో కేసీఆర్ చేసి చూపారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం” అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Also Read : BRS ముఖ్యనేతల పోటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్‌, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు