MLC polls : బీజేపీ అభ్యర్థి ఓటమి.. వాణీదేవి విజయం

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించారు.

MLC polls : బీజేపీ అభ్యర్థి ఓటమి.. వాణీదేవి విజయం

Vani Devi Trs

Surabhi Vani Devi : తెలంగాణ రాష్ట్రంలోని ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు పొందారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి లక్షా 49 వేల 269 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో లక్షా 12 వేల 689 ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యతలో 36 వేల 580 లభించాయి.

మొదటి రౌండ్‌ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఆధిక్యంలో కొనసాగింది. ఏడు రౌండ్లలోనూ వాణిదేవికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరోవైపు వాణిదేవి గెలుపుతో టీఆర్ఎస్‌లో సంబరాలు మొదలయ్యాయి. బీజేపీకి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ సిట్టింగ్‌ స్థానం. టీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ గట్టిపోటి ఇచ్చింది. రామచంద్రరావుకు మొత్తం లక్షా 37 వేల 566 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో లక్షా 4 వేల 668 ఓట్లు కాగా.. 32 వేల 898 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత కంటే బీజేపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లే ఎక్కువ వచ్చాయి. ప్రొ.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియతో వాణీదేవి విజయం ఖరారైంది.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు వాణీదేవి ఫౌండర్‌గా ఉన్నారు. ప్రముఖ విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా, చిత్రకారిణిగా ఆమెగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాల్లో మంచి పేరు సంపాదించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు చేదోడు.. వాదోడుగా వాణీదేవి ఉండేవారు.