Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలంగాణ రాజకీయ ప్రముఖలతో పిళ్లైకు సంబంధాలు

రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలంగాణ రాజకీయ ప్రముఖలతో పిళ్లైకు సంబంధాలు

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాఫ్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారం ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్న ఈడీ.. ముడుపులపై కూపీ లాగుతోంది. ఢిల్లీ మద్యం టెండర్లలో కంపెనీల సిండికేట్ కు హైదరాబాద్ లో రూపకల్పన జరిగిందటూ సీబీఐ అనుమానించడంతో హైదరాబాద్ లో 6 చోట్ల.. ఢిల్లీ ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశాయి. అనేక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

ఈ డాక్యమెంట్లను, హార్డ్ డిస్క్ లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న ఈడీ జరిపిన సోదాల్లో లిక్కర్ కుంభకోణం కేసులో ఏ14గా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, ఆయన డైరెక్టర్ గా ఉన్న రాబిన్ డిస్టలరీస్ కార్యాలయం, ఇతర డైరెక్టర్ల నివాసాలు ఉన్న సికింద్రాబాద్, కోకాపేట్, నార్సింగ్ లో సోదాలు జరిగాయి.

పిళ్లై నివాసంలో ఈడీకి కీలక ఆధారాలు దొరికాయి. ఎడికోర్ అనే కంపెనీ వివరాలు వెలుగుచూశాయి. 2010లో సుదిని సృజన్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు డైరెక్టర్లుగా ఎడికోర్ కంపెనీ ఏర్పాటైంది. ఎడికోర్ కంపెనీకి చెందిన పలు డాక్యుమెంట్స్ ని ఈ సోదాల్లో గుర్తించిన ఈడీ అధికారులు, ఆ కంపెనీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో తెలంగాణ రాజకీయ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ.. వారితో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు జరిపిన వారి వివరాలన్నీ కూపీ లాగుతోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా రామచంద్ర పిళ్లై, కవిత కుటుంబం, ఇతర టీఆర్ఎస్ నాయకులతో కలిసి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లి పూజలు చేసినట్లు ఈడీ దర్యాఫ్తులో తేలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై కవిత ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇప్పుడు రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రామచంద్ర పిళ్లై ఇతర వ్యాపారాలపైనా దృష్టి పెట్టింది ఈడీ. హైదరాబాద్ సహా ఢిల్లీ, చెన్నై, కర్నాటకలో వ్యాపారాలపై ఆరా తీస్తోంది.

ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, బెంగళూరు నగరాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ లిక్కర్ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లు బయటికి రావడం మరింత సంచలనం రేపింది. లిక్కర్ స్కామ్ రాజకీయ రంగు పులుముకుంది.

ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై సహా అభిషేక్ రావు, సుదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్‌సాగర్ నివాసాలు, కార్యాలయాలతో పాటు రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి.

ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. రాజకీయ నాయకులు, ప్రముఖులు కలిసి ఈ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలకు పాల్పడి మనీ లాండరింగ్ చేశారని వార్తలొచ్చాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు చేసిన సమాచారం మేరకు ఈడీ రంగ ప్రవేశం చేసింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం నిందితులుగా ఉన్న వారందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.