Etela Rajender : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. బతికుండగానే బొందపెట్టాలనుకున్నారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.

Etela Rajender : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. బతికుండగానే బొందపెట్టాలనుకున్నారు

Etela Rajender

Etela Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.

తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని ఈటల వాపోయారు. 19ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బతికి ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వాపోయారు. సీఎం కేసీఆర్‌కు తనకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ ఉందని.. మంత్రి హరీష్ రావుకు కూడా ఇవే అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా అయిందని మండిపడ్డారు. ప్రగతిభవన్‌ను బానిస నిలయంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌పై ఎదురు దాడికి దిగారు ఈటల రాజేందర్.

‘‘అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ప్రజలు గెలిపించారు. అప్పుడు కేసీఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. నన్ను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న మంత్రి హరీశ్‌రావుకు అవమానం జరిగింది. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా? ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు’’ అని ఈటల అన్నారు.

నేనే పథకాన్ని విమర్శించలేదు. రైతుబంధు గురించి కొన్ని సూచనలు చేశా. ఆదాయపన్ను కట్టే వారికి రైతు బంధు ఇవ్వొద్దని చెప్పాను. వారు వ్యవసాయం చేయరు. ఆ డబ్బులను పేద రైతులకు ఇస్తే బాగుంటుందని సూచించా. ఇదేమైనా తప్పా? అని ఈటల అడిగారు.