Etela Rajender : ఈటల రాజకీయ భవిష్యత్ ఏంటీ ? ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ...సస్పెన్స్‌కు తెరదించనున్నారు. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారు. భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌..రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది.

Etela Rajender : ఈటల రాజకీయ భవిష్యత్ ఏంటీ ? ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా!

Etela

Etela Rajender’s Next Plan : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ …సస్పెన్స్‌కు తెరదించనున్నారు. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారు. భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌..రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రెస్‌మీట్‌లో ప్రకటించనున్నారు. హస్తినలో పర్యటించి బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన ఈటల …ఆ పార్టీలో చేరికపై స్పష్టత ఇవ్వనున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఈటల హాట్‌టాపిక్‌ అయ్యారు. బీజేపీ కీలక నేతలతో విస్తృత మంతనాలు జరిపి హైదరాబాద్ చేరుకున్న ఈటల.. కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తన అభిప్రాయాన్ని అనుచర నేతలు, కార్యకర్తలతోనూ చర్చించారు. తుది నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. బీజేపీ అగ్రనేతల సూచనల మేరకే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, గులాబీ పార్టీకి రాంరాం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు బీజేపీ పార్టీలో చేరేది తేలే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌లో కల్వకుంట్ల కుటుంబం తర్వాత రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న ఈటల తనతో పాటు మరికొంతమంది నేతలను బీజేపీలో చేర్చేందుకు పావులు కదుపుతున్నారు.

ప్రస్తుతానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌ పర్సన్‌ తుల ఉమ, ఈటల ప్రధాన అనుచరుడు సమ్మిరెడ్డి…కాషాయదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది కానీ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అధికార పార్టీలో ఈటలతో సన్నిహితులుగా గుర్తింపు పొందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉన్నా, ఇప్పటికిప్పుడే వారు ఈటలతో కలసి నడిచే అవకాశం లేదని తెలుస్తోంది.

గులాబీ పార్టీలో, ప్రభుత్వంలో తన అనుభవాలు, ఎదుర్కొన్న అవమానాలు వివరిస్తూనే అధికార పార్టీతో తలపడేందుకు ఈటల సిద్ధపడినట్లు తెలుస్తోంది. వీటన్నిటినీ మీడియా సమావేశంలో..వెల్లడించే అవకాశం ఉందని ఈటల సన్నిహితులు చర్చించుకుంటున్నారు.

Read More : CM Jagan : రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్ లేఖలు