Etela Rajender: బీజేపీలోకి ఈటల.. రాజీనామాపై నిర్ణయం పార్టీదే!

Etela Rajender: బీజేపీలోకి ఈటల.. రాజీనామాపై నిర్ణయం పార్టీదే!

Etela Rajender

Etela set to join BJP: కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవిని కోల్పోయాక పలు పార్టీల నేతలతో చర్చించిన ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు చేరాలనేదానిపై నిర్ణయం బీజేపీకే వదిలేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకేనని చెప్పినట్లు తెలిసింది.

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్‌.. పలువురు బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల.. తెలంగాణ ఉద్యమకారుడైన తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. తనలాంటి ఉద్యమకారులు చాలామంది తెలంగాణలో ఉన్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌పై పోరాటాలకు బీజేపీ వ్యూహాలు బీజేపీకి ఉంటాయన్న నడ్డా.. టీఆర్‌ఎస్‌ అవినీతిని బయటపెడతామని ఈటలతో చెప్పినట్లు తెలిసింది. సమయం వచ్చినప్పుడు విచారణ జరిపిస్తామని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని, రాష్ట్రంలో బీజేపీ శక్తివంతంగా తయారవుతోందని నడ్డా ఈ సంధర్భంగా ఈటలతో చెప్పారు.

ఈటలతో భేటీ కావడానికి ముందు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో చర్చించారు జేపీ నడ్డా. నడ్డాతో చర్చలు ముగిశాక.. తరుణ్ చుగ్‌ను కలిసి రెండు గంటల పాటు చర్చించారు.