Fever Survey 1st Day : హైదరాబాద్‌లో మొదటి రోజు ఇంటింటి ఫీవర్ సర్వే.. 150మందికి పాజిటివ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది.

Fever Survey 1st Day : హైదరాబాద్‌లో మొదటి రోజు ఇంటింటి ఫీవర్ సర్వే.. 150మందికి పాజిటివ్..

Fever Survey 1st Day Hyderabad Door To Door Fever Survey First Day, Covid Kits Supply To Patients

Hyderabad Door-to-Door Fever Survey : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను చేపట్టారు అధికారులు. శుక్రవారం (జనవరి 21) నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే మొదలైంది. తెలంగాణలోని అన్నీ జిల్లాలోని వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో మొదటిరోజు పూర్తి అయింది. ఈ సర్వేలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కలిగినవారిని పెద్ద సంఖ్యలో అధికారులు గుర్తించారు. వారందరికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారికి 8 రకాల మందులతో కూడిన కోవిడ్ కిట్లను అందజేశారు. డైట్ ప్లాన్‌ను ఎలా ఫాలో కావాలో వైద్య సిబ్బంది కరోనా బాధితులకు సూచించారు. హైదరాబాద్ ఫీవర్ సర్వే జరిగే తీరును సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పరిశీలించారు.

అంబర్‌పేట సర్కిల్‌ సమీపంలోని అన్ని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బస్తీలు, కాలనీల్లో ఫీవర్ సర్వేను ప్రారంభించారు. డీపీవో రజిత, ఎస్పీహెచ్‌వో డా.హేమలత, సర్కిల్‌ డీసీ వేణుగోపాల్‌, మెడికల్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగింది. బాగ్‌అంబర్‌పేట, తిలక్‌నగర్‌, అర్రాస్‌పెంట, ఏఎంఎస్‌ యూపీహెచ్‌సీల పరిధిలోని బస్తీల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఒక్కో ఆశ వర్కర్‌ 60 ఇళ్లల్లో సర్వే చేసి కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులను గుర్తించారు. ప్రతి యూపీహెచ్‌సీ పరిధిలో 2100 ఇళ్లల్లో సర్వే చేయగా, 150 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. వారందరికి మెడికల్‌ కిట్లు అందజేశారు.

ఇప్పటికే తెలంగాణలో 2 కోట్ల కరోనా టెస్టు కిట్లు, కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఐసొలేషన్ కిట్లో ఉన్న మందులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే కరోనా బాధితుల్లో సమస్య తీవ్రంగా ఉన్నవారు తప్పనిసరిగా సమీప ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరిపడా ఐసోలేషన్ కిట్లను వైద్యశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ రెండున్నర లక్షల కిట్స్ సిద్ధం చేసినట్టు చెప్పారు. రానున్న 20 రోజుల పాటు అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు. కరోనా రోగులకు ప్రత్యేకంగా తయారు చేసిన ఐసొలేషన్ కిట్‌లో 8 రకాల మందులు అందజేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ మందులను కూడా పంపిణీ చేయనున్నారు. హోమ్ ఐసొలేషన్ కిట్లతో పాటు, కరోనా నిర్ధారణ అయిన వారికి రోగనిరోధకతను పెంచే పౌష్టికాహారాన్ని పంపిణీ చేసే యోచనలో వైద్యారోగ్యశాఖ ఉన్నట్లు తెలిసింది.

Read Also : Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌..