నామినేషన్లు ముగిశాయి, ఇక ప్రచారం..పార్టీల స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 11:31 PM IST
నామినేషన్లు ముగిశాయి, ఇక ప్రచారం..పార్టీల స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే

star campaigners for polls : గ్రేటర్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింగి. ఇక ప్రచారానికి తెరలేవనుంది. ఎన్నికల కమిషన్ స్టార్ క్యాంపెయినర్లను నియమించుకోడానికి అనుమతినివ్వడంతో పార్టీలన్నీ అగ్ర నేతలతో ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. గ్రేటర్‌లో పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.



టీఆర్ఎస్ : – 
ఇప్పటికే పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేసిన అధినేత కేసీఆర్.. ప్రచారంలో పాల్గొననున్నారు. ఈసీ సూచనల మేరకు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఇచ్చింది. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.



బీజేపీ : – 
బీజేపీ విషయానికి వస్తే… గ్రేటర్‍‌లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమలం పార్టీ.. బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, డీ.కె. అరుణ ప్రచార బరిలో దించింది. అలాగే.. .మురళీధర్‌రావు, వివేక్‌, గరికపాటి మోహన్‌రావు, రాజాసింగ్‌, అర్వింద్‌, రఘునందన్‌రావులను స్టార్ క్యాంపెయినర్లుగా ఈసీకి జాబితా ఇచ్చింది. మరోవైపు… పార్టీ అగ్రనేతలతో పాటూ, మరికొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారం ముగింపు రోజు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రకాష్ జవదేకర్లతో పాటు బీజేపీ యువజన విభాగం బాధ్యతలు చూసుకునే తేజస్వి సూర్య కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.



కాంగ్రెస్ : – 
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ… గ్రేటర్‌లోనైనా జెండా ఎగురేయాలని తపన పడుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ నేతలు.. ప్రచారంపై దృష్టిపెడుతున్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌, కోమటరెడ్డి వెంకట్‌రెడ్డి, జెట్టి కుసుమకుమార్‌, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి ఇచ్చింది.