ప్రచారానికి తెర : మూగబోనున్న మైకులు, ప్రచారం నిర్వహిస్తే కఠిన శిక్షలు

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 07:09 AM IST
ప్రచారానికి తెర : మూగబోనున్న మైకులు, ప్రచారం నిర్వహిస్తే కఠిన శిక్షలు

GHMC election: గ్రేటర్‌లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా… జరిమానా విధించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించరాదని తెలిపింది.



అంతేకాదు.. టీవీలు, సినిమాటో గ్రఫీ ద్వారా ప్రసారాలు సైతం చేయరాదని స్పష్టం చేసింది. గడువు ముగిసిన వెంటనే మద్యం అమ్మకాలపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతేకాదు… ప్రచార గడువు ముగిశాక… జీహెచ్‌ఎంసీ పరిధిలో నివాసం లేనిలేని వారు, ఓటర్లు కానివారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రచారకర్తలందరూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎస్‌ఈసీ ఆదేశించింది.



పోలింగ్‌ రోజున అభ్యర్థికి ఒక వాహనాన్ని మా్తరమే అనుమతించనుంది ఎస్‌ఈసీ. దానికి సంబంధిత డివిజన్‌లో మాత్రమే అనుమతిస్తుంది. పర్మిషన్‌ లెటర్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అభ్యర్థి, అతని ఏజెంట్‌ ఈ వాహనంలో తిరగడానికి ఎస్‌ఈసీ అనుమతి ఇచ్చింది. ఇతరులకు ఈ వాహనంలో అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి వాహనాల్లో ఓటర్లను పోలింగ్‌ స్టేషన్లకు తరలించడం కూడా నేరమని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లు, రిలీఫ్‌ ఏజెంట్లుగా సంబంధిత డివిజన్‌ పరిధిలోని వారినే నియమించాలని అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించింది. డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తారు. డిసెంబర్‌ 4న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.