గ్రేటర్ ఎన్నికలు : డిసెంబర్ 02 వరకు మద్యం షాపులు బంద్

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 09:58 AM IST
గ్రేటర్ ఎన్నికలు : డిసెంబర్ 02 వరకు మద్యం షాపులు బంద్

Liquor shops closed till December 02 : గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2020, నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 01న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఎన్నికల అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో..జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 01వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.



డిసెంబర్ 04వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉండడంతో ఆ రోజు మొత్తం వైన్ షాపులు బంద్ కానున్నాయి. దీంతో మద్యం బాబులు ముందుగానే బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. బల్క్ మద్యం కొనుగోళ్లు, విక్రయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అబ్బారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. బల్క్ గా మద్యం విక్రయాలు జరిపితే..సంబంధిత మద్యం దుకాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు.



ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులతో కలిసి ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తంగా..ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఆ తర్వాత..డిసెంబర్ 02వ తేదీ వరకు ఆగాల్సిందే.