బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత హరీష్

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత హరీష్

Harish joins bjp: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటించారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ బీజేపీలో చేరారు. కండువా కప్పి పాల్వాయి హరీష్ రావుని బీజేపీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ శక్తిమంతమైన పార్టీగా మారుతోందని బండి సంజయ్ అన్నారు.

కాగజ్ నగర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని సంజయ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనప్ప పని ఖతమని అన్నారు. 2 బర్రెలతో వచ్చిన వ్యక్తి 200 కోట్లు సంపాదించాడని కోనప్పపై విరుచుకుపడ్డారు. 30 కోట్ల ప్రాణహిత ప్రాజెక్టును లక్ష కోట్ల ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. ఈ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. గుర్రంపాడు తండాలో గిరిజనులను ఇబ్బందులు పెడుతున్నారన్న సంజయ్, ప్రశ్నించిన బీజేపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లో పెట్టారని మండిపడ్డారు.

దేశాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరినీ బీజేపీలోకి స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ పేరు వింటేనే కేసీఆర్‌కు భయం పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో గడీల పాలనను అంతమొందించాలన్నారు. రాజకీయ లబ్ది కోసమే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

ఓడిపోయే ఎమ్మెల్సీ సీటును పీవీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ కేటాయించారని బండి సంజయ్ అన్నారు. గెలిచే దమ్ముంటే కేసీఆర్ ఒక చోట, కేటీఆర్ మరో చోట పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఓడిపోయే సీటిచ్చి పీవీని అవమానించారని చెప్పారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అడ్వకేట్ దంపతుల హత్యలపై సీబీఐ విచారణ కోరాలన్నారు. టీఆర్‌ఎస్ విముక్తి కోసం బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలన్నారు.