హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు, టీఆర్ఎస్ నేత హస్తం?

హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు, టీఆర్ఎస్ నేత హస్తం?

highcourt lawyer couple murder case: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల వెనుక టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పోలీసులు తేల్చారు. కుంట శ్రీనివాస్ తనను హత్య చేశాడని చనిపోయే ముందు వామన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. కొంతకాలంగా కుంట శ్రీనివాస్ తో వామన్ రావుకు విబేధాలు ఉన్నాయి. వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఇద్దరి మధ్య భూ వివాదం ఉంది.

వామన్ రావు దంపతులు కారులో మంథని నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా కుంట శ్రీనివాస్ అనుచరులు కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వామన్ రావుని కారులో నుంచి కిందకు లాగి కత్తులతో పొడిచారు. అడ్డుపడిన భార్య నామమణిని కూడా దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ హత్య జరిగింది. కాగా, వామన్ రావు కారు డ్రైవర్ దాడి నుంచి తప్పించుకున్నారు.

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతోనూ వామన్ రావుకి విబేధాలు ఉన్నాయి. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్టా శైలజ అనర్హత కేసుని వామన్ రావు వాదిస్తున్నారు. అలాగే శీలం రంగయ్య లాకప్ డెత్ కేసుని హైకోర్టులో వాదిస్తున్నారు. లాకప్ డెత్ కేసు విషయంలో పోలీసులకు, వామన్ రావుకి మధ్య విబేధాలు ఉన్నాయి. కుంట శ్రీనివాస్ తనపై దాడి చేశాడని చనిపోయేముందు వామన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో నడిరోడ్డుపై ఆయన పడి ఉన్నారు. సాయం చేయాలని వేడుకున్నారు. స్థానికులు, పోలీసులు వామన్ రావు దంపతులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడం, రక్తస్రావం కావడంతో.. వామన్ రావు దంపతులు మృతి చెందారు.