హైదరాబాద్‌లో ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ.లక్ష, కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు

  • Published By: naveen ,Published On : July 11, 2020 / 11:22 AM IST
హైదరాబాద్‌లో ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ.లక్ష, కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు

హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు పోలీసులు. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకాలపై దృష్టి పెట్టిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడులు చేసింది. వారి నుంచి 34 ఆక్సిజన్ సిలిండర్లను స్వాధనం చేసుకున్నారు. వాటిని ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఈ ముఠాలు బ్లాక్ మార్కెట్ లో రెట్టింపు ధరకు ఆక్సిజన్ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో సిలిండర్ కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిసి షాక్ తిన్నారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ ను కొంతమంది దళారులు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు.

రెండు చోట్ల ఆకస్మిక దాడులు:
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ నగరంలోని రెండు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించింది. అనుమతుల్లేకుండా ఆక్సిజన్ సిలిండర్ల అమ్నుతున్నారన్న పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే చర్యలు తప్పవని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.

ఆక్సిజన్‌ కొనేస్తున్నారు!

ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఆక్సిజన్‌ సిలిండర్లను నల్ల బజారుకు(బ్లాక్ మార్కెట్) తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఇప్పటికే హెచ్చరించారు. సిలిండర్లను బ్లాక్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తుండటంతో శుక్రవారం(జూలై 10,2020) రాత్రి సంబంధిత అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. తనిఖీ కోసం డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌, ప్రజారోగ్య శాఖ, ఎక్స్‌ప్లోజివ్స్‌ డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్‌లతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు.

డీలర్లు మార్గదర్శకాలను పాటిస్తున్నారా? లేదా? అని ఈ బృందం తనిఖీ చేయనుంది. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలకు సిఫారసు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 చికిత్సలు అందిస్తున్న ఆస్పత్రులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సిలిండర్ల సమస్య తలెత్తితే క్రయోజెనిక్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు/వెస్సెల్స్‌ను ఆశ్రయించాలని సూచించారు. ఆక్సిజన్‌ సిలిండర్లను నిల్వచేసే ట్రేడర్లు ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ నుంచి లైసెన్సు తీసుకోవాలని చెప్పారు.