బాలుడి కిడ్నాప్, 800 కిలోమీటర్ల ప్రయాణించిన పోలీసులు

బాలుడి కిడ్నాప్, 800 కిలోమీటర్ల ప్రయాణించిన పోలీసులు

Hyderabad police : హైదరాబాద్‌లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని రక్షించారు. చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ అబిడ్స్‌ పరిధిలో మూడు సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు పది రోజుల్లో చేధించారు. కర్నాటకకు చెందిన శివకుమార్, అంబికా దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి పలు పనులు చేసుకుని జీవిస్తున్నారు. నాంపల్లిలోని లేబర్ అడ్డా వద్ద తమ కుమారునితో పాటు, మరో ఇద్దరు అమ్మాయిలతో పని కోసం రోజూ వచ్చే వారు.

వీరి వద్ద ఉన్న ముగ్గురు పిల్లలను గమనించిన నిందితుడు సామ్ భీమ్రావ్.. బాలుడిని ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. అక్కడి నుంచి బాలుడితో సహా పరారయ్యాడు. బాబు కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకోసం పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన చిన్నారిని తీసుకుని భీమ్రావ్ నాంపల్లి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి అఫ్జల్ గంజ్ స్లమ్ ఏరియాకు వెళ్లాడు. అక్కడి నుంచి బస్సు ద్వారా సికింద్రాబాద్ వెళ్లి.. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు.

సీసీ కెమెరాలు, మహారాష్ట్ర పోలీసుల సాయంతో అబిడ్స్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దాదాపు 300 సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు చొక్కా, ప్యాంట్, కదలికల ఆధారంగా 800 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కిడ్నాపర్‌ సొంతూరులో బాలుడిని రక్షించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. సీసీ కెమెరాల ద్వారా చేధించడం చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.