వామనరావు దంపతుల హత్య కేసు..సుందిళ్ల బ్యారేజీలో కత్తులు, సెల్‌ఫోన్లు పడేసిన నిందితులు

వామనరావు దంపతుల హత్య కేసు..సుందిళ్ల బ్యారేజీలో కత్తులు, సెల్‌ఫోన్లు పడేసిన నిందితులు

Lawyer Vamana Rao couple’s murder case : లాయర్‌ వామనరావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు మరింత స్పీడందుకుంది. వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, సెల్‌ఫోన్లను సుందిళ్ల బ్యారేజ్‌లో గాలించేందుకు గజ ఈతగాళ్లు పెద్దపల్లి జిల్లా చేరుకున్నారు. గోదావరిలో కత్తులు రికవరీ చేయడానికి వైజాగ్‌ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు పోలీసులు.

వామనరావు దంపతులను హత్య చేశాక… నిందితులు వాహనంలో వెళ్తూ సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులను పడేశారు. దీంతో కస్టడీలో ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను ఎవరి కంటా పడకుండా బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లి విచారించింది దర్యాప్తు బృందం. ఆయుధాలు పడవేసిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు కుంట శ్రీను.

అయితే కత్తులు బ్యారేజ్‌లో పడేసి 10 రోజులవుతోంది. దీంతో నీళ్ల అడుగున ఇసుక కిందకు చేరి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కత్తులను వెలికితీయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయుధాలను వెలికితీయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు పోలీసులు.

ఇటు కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను పోలీసులు భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు బిట్టు శ్రీనును కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను ప్రశ్నించిన పోలీసులు…లాయర్‌ దంపతుల హత్యకు రాజకీయ ప్రమేయం లేదని, అందుకు సంబంధించిన ఆధారాలేమీ ఇంతవరకు లభించలేదని అంటున్నారు. అరెస్ట్‌ చేసినప్పుడు తొలిసారి వెల్లడించిన అంశాలనే కస్టడీలోనూ పునరావృతం చేస్తున్నారట నిందితులు. గ్రామంలో గొడవలు, వ్యక్తిగత కక్షలతోనే కుంటశ్రీను, బిట్టు శ్రీను కలిసి వామనరావు దంపతుల హత్యకి ప్లాన్‌ చేశారనేది పోలీసుల వాదనగా ఉంది.

వామనరావు దంపతులకు బిట్టు శ్రీనుకు ఎందుకు అంత కక్ష. ? సరిగ్గా ఇదే అంశంపై మరోసారి విచారణ జరపనున్నారు పోలీసులు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా…ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమగ్ర విచారణ జరుపుతున్నామంటున్నారు రామగుండం కమిషనరేట్ పోలీసులు.