Minister KTR : డాక్టర్ కావటం అంత ఈజీ కాదు,నాకు ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు రాలేదు : కేటీఆర్
నేను కూడా బైపిసి స్టూడెంట్ నే. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది..మా నాన్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలనుకున్నారు.నాకు అప్పుడు ఎంసెట్ లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ నాకు డాక్టర్ సీట్ రాలేదు.

Minister KTR
Minister KTR medical colleges : తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రగతిభవన్ నుంచి ప్రారంభించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీ వద్ద మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ కావటం అంత ఈజీ కాదని తనకు 1993లో తనకు మంచి ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు రాలేదని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన స్వీయ అనుభవాలను మంత్రి కేటీఆర్ పంచుకున్నారు.
కేటీఆర్ మాట్లాడుతు..1993 లో నేను కూడా బైపిసి స్టూడెంట్ నే. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది..మా నాన్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలనుకున్నారు.నాకు అప్పుడు ఎంసెట్ లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ నాకు డాక్టర్ సీట్ రాలేదు.అప్పటికాలంలో డిగ్రీ కాలేజ్ కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కాలేజ్ లు వచ్చాయి.
రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పిజి విద్య మన జిల్లా లోనే ఏర్పాటు చేసుకున్నాం. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో వుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవి. మొన్నటి దాకా ఇక్కడ డాక్టర్ల కొరత వుండేది. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వలన కేవలం మన జిల్లాలో దాదాపు 100 కు పైగ డాక్టర్లు సేవలందిస్తారు.తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభా కు 22 మంది డాక్టర్లు వున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేశారు.
తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ 21 మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజ్ లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాని మోడీ లాంటి వాళ్ళు సహకరించకపోయినా..జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.కాంగ్రెస్, బీజీపీలు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి..?వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి..?ఢిల్లీ వాళ్లని అడగాలి. కానీ మనకు అలా కాదు. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం.
సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీ నరసింహను మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల.మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు అని అన్నారు.