’కాళేశ్వరం’ రాజన్నసిరిసిల్ల జిల్లాకే తలమానికం : కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 02:55 AM IST
’కాళేశ్వరం’ రాజన్నసిరిసిల్ల జిల్లాకే తలమానికం : కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజి రిజర్వాయర్‌ నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకే తలమానికమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలోని సొరంగం, సర్జిపుల్‌, మల్కపేటలో జరుగుతున్న రిజర్వాయర్‌ నిర్మాణ పనులను ఆయన ఫిభ్రవరి 4 సోమవారం పరిశీలించారు. పనుల ప్రగతి, పంట కాలువల నిర్మాణం, భూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చి బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లను కేటాయించటం జరిగిందన్నారు. గోదావరి జలాలను తరలించటానికి నాడు రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 11 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇంజినీరింగ్‌, రెవెన్యూ అధికారులు రాత్రి, పగలు పనిచేయడంతో 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే సెప్టెంబరు నాటికి నీటి విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మల్కపేట రిజర్వాయర్‌ నుంచి చెరువులు, కుంటలను నింపడానికి అధికారులు ప్రణాళికలను రూపొందించాలన్నారు. దీంతో భూగర్భ జలాలు పెంపొంది ఏడాదికి మూడు పంటలు పండించుకోవడంతో భూములు సస్యశ్యామలంగా మారతాయన్నారు. తత్ఫలితంగా రైతులు ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.