వందేళ్ల తర్వాత : విశ్వ రూపం చూపిస్తున్న మూసీ నది

  • Edited By: madhu , October 15, 2020 / 08:31 AM IST
వందేళ్ల తర్వాత : విశ్వ రూపం చూపిస్తున్న మూసీ నది

musi river : నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీనది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. వరద పోటుతో.. అసలు అక్కడో బ్రిడ్జి ఉందనే విషయం తెలీని రీతిలో తీస్తున్న పరవళ్లు.. చూసే వాళ్లందరికి షాకిస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా.. ఈ వరదకు జోరువాన తోడైతే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.కుండపోత వర్షానికి హైద‌రాబాద్‌ తడిసిముద్దైంది. కనివిని ఎరుగని రీతిలో ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో గంటల తరబడి వర్షం కురిసింది. మహానగరం భయంతో వణికిపోయింది. వర్ష బీభత్సంతో విలవిలలాడింది. మరోవైపు.. వందేళ్ల తర్వాత మూసీ నది విశ్వ రూపం చూపిస్తోంది. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. మూసీని ప్రక్షాళన చేయకపోవడంతో… నదిలోని చెత్త మొత్తం జనావాసాల్లోకి కొట్టుకు వస్తోంది. కాలనీలు నీట మునిగాయి. భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుండటంతో.. జనాలు ఆందోళన చెందుతున్నారు.గతంలో ఎన్నడూ లేనంతగా మూసీకి వరద పోటెత్తింది. పురానాపూల్ వ‌ద్ద మూసీ న‌ది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డుపైకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. దీంతో ఆ రోడ్డును మూసివేయాల్సి వచ్చింది. ఇక మూసీ దాటికి ఓల్డ్ సిటీలో కాలనీలు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. ఓవైపు ప్రవాహం కొట్టుకు వస్తుంటే.. గడ్డి పరకల్లా జనాలు, వాహనాలు, వస్తువులు కొట్టుకుపోయాయి.వందేళ్ల క్రితం మూసీ సృష్టించిన ప్రళయం ఇప్పటికీ భాగ్యనగర వాసుల కళ్లల్లో కదులుతూనే ఉంటుంది. 1908 సెప్టెంబర్ 27, 28 రెండు రోజులు హైదరాబాద్ అతలాకుతలం అయింది. ప్రశాతంగా ప్రవహించే మూసీ ఒక్కసారిగా ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తింది. మూసీపై ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ధాటికి భాగ్యనగరంలో మూడో వంతు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఆనాటి వరదల్లో సుమారు 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికి పైగా దిక్కులేని వారయ్యారు. 36గంటల పాటు కురిసిన భారీ వర్షానికి చెరువులు తెగిపోయాయి. 60 అడుగుల మేర నీరు ఉప్పొంగి ప్రవహించింది. అప్పట్లోనే 20కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. హైదరాబాద్ చరిత్రలో అదో మానని గాయం.ఉత్పాతాలను తట్టుకునే, నివారించే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో అలా జరగడం సహజమే కావొచ్చు. కాని 110 ఏళ్ల తర్వాత తరువాత 2020లో ఇవాళ్టి పరిస్థితి ఏంటి.. అంటే వచ్చే సమాధానం ఇప్పటికీ అదే దుస్థితి. మరింత దీనావస్థ. నమ్మశక్యం కాకున్నా నమ్మితీరాల్సిన చేదు నిజం. మూసీకి వరదలు వస్తే, కళ్ళప్పగించి చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదంటే కాదనలేని వాస్తవం. ఆనాటి వరద బీభత్సం ప్రకృతి ప్రకోపం అని సరిపెట్టుకున్నా.. ఇప్పటి బీభత్సాలు మాత్రం అక్షరాలా మానవ తప్పిదాల కారణంగానే అంటున్నారు నిపుణులు.1908 సెప్టెంబర్ వర్షం మళ్లీ ఇప్పుడు కురిస్తే… భాగ్యనగరం తట్టుకోగలదా.. అందుకు సమాధానం ఇప్పటికీ మన అధికారుల వద్ద, పాలకుల వద్ద లేదు. ఓవైపు మూసీ దాదాపు 70 శాతం ఆక్రమణలకు గురైంది. ఇక చెత్తా చెదారం మొత్తం అందులోనే డంప్ చేయడంతో.. పూర్తిగా కలుషితమైపోయింది. వికారాబాద్ జిల్లాలో ప్రారంభమై నల్లగొండ జిల్లాలో ముగిసే ఈ నదివెంట.. ఎక్కడ చూసినా ఇళ్లు, నిర్మాణాలే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇదే నగరం కొంప ముంచింది. వరద పోటెత్తడంతో… నీళ్లు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. దీంతో.. పొంగి పొర్లి.. ముంచేసింది. వరదలో కొట్టుకువస్తున్న చెత్త.. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది.వాస్తవంగా మూసీలో ఎప్పుడు చూసినా మురుగు నీరే కనిపిస్తూ ఉంటుంది. మూసీ ప్రక్షాళన చేస్తామని అధికారులు.. ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా… ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఇది విశ్వ నగరం కాదు.. విశ్వ నరకం అంటూ నెటిజన్లు సైటైర్లేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూసీ పరవళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. కొన్నిచోట్ల దాని దూకుడు ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తాం అని చెప్పి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో… ఇప్పుడు తనకు తానే ప్రక్షాళన చేసుకుంటుందనే నెటిజన్ల సెటైర్లు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.